Madhu Sudhan on Chandra Babu: టీడీపీ అధినేత చంద్రబాబుపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తీవ్ర స్థాయిలో కామెంట్లు చేశారు. చంద్రబాబు కాకపోతే ఆయన కుమారుడు నారా లోకేష్ ఎవరికైనా సరే దమ్ముంటే తన మీద పోటీ చేసి గెలువాలి అంటూ సవాల్ విసిరారు. భయమంటే ఏంటో తెలియని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరఫున ఉన్న ఆయనకు... చంద్రబాబు, నారా లోకేష్ అంటే ఏమాత్రం భయం లేదని వ్యాఖ్యానించారు. ఎవరైనా సరే తల్లిని మోసం చేసినా, తల్లి లాంటి పార్టీని మోసం చేసిన శిక్ష అనుభవించక తప్పదని చెప్పుకొచ్చారు.


అన్ని వర్గాలకు సీఎం జగన్ సీట్లిచ్చారు ! 
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎవరికీ చెడు చేయరని చెప్పారు. కాకపోతే పలువురు స్వార్థం వల్ల అంటే మంత్రి పదవులు ఇవ్వకపోవడం వల్ల పార్టీలు మారుతున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి నేతల్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఏం చంద్రబాబు లాగా... 20 సీట్లు కాపులకు, మరో 20 సీట్లు నాయుళ్లకు ఇవ్వలేదని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ.. ఇలా అన్ని వర్గాల ప్రజల పక్షాన ఉండే వ్యక్తి అన్నారు. సీఎం జగన్ ని వదిలి వెళ్లిన ఏ ఒక్కరు కూడా పైకి రాలేరని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 


కొన్ని కోట్ల మంది ప్రజలకు మంచి చేసే సీఎం జగన్ బాగుండాలని చాలా మంది కోరుకుంటారని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి అన్నారు. ఎవరో కొందరు ఆయనకు ఏదో అయిపోవాలని కోరుకుంటే వాళ్లే నాశనం అయిపోతారని అన్నారు. చంద్రబాబు వచ్చినా, ఆయన కుమారుడు లోకేష్ వచ్చినా సీఎం జగన్ భయపడే ఛాన్సే లేదన్నారు. వైఎస్ఆర్సీపీ చాలా స్ట్రాంగ్ పార్టీ అని మరో 30 ఏళ్ల పాటు ఈ పార్టీనే అధికారంలో ఉంటుందని దీమా వ్యక్తం చేశారు.


పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి అని కామెంట్ 
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా మంచి వ్యక్తి అని వెల్లడించారు. కానీ టీడీపీ నేతలు, నారా లోకేష్ ఆయన్ను ప్రజల్లో విలన్ ను చేసేశారని తెలిపారు. చిరంజీవి, వంగవీటి మోహనరంగా వీళ్లెవరూ చంద్రబాబును నమ్మరని స్పష్టం చేశారు. అన్ని పార్టీలు అతడిని నమ్మి మోసపోయాయని అన్నారు. పవన్ కల్యాణ్ నేను పోయి మోసపోతానంటే మనమేం చేస్తాం చెప్పండంటూ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కూడా తీవ్ర స్థాయిలో  విరుచుకుపడ్డారు. నారా లోకేష్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మాట్లాడితే చాలా సంతోషం అంటూ ఎద్దేవా చేశారు. 


లోకేశ్ పాదయాత్రలో ఉద్రిక్తత
అంతకు ముందు చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గం సంసిరెడ్డిపల్లెలో లోకేశ్ ప్రసంగాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మైక్‌ పట్టుకున్న వ్యక్తిని లాగేశారు. స్టూల్‌పై నిల్చొని ప్రసంగిస్తున్న లోకేశ్ ను కూడా లాగేందుకు యత్నించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. పోలీసుల చర్యల కారణంగానే టీడీపీ కార్యకర్తల్లో అసహనం పెరిగిందని తిరగబడ్డారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రోడ్డుపై బహిరంగ సభలకు అనుమతి లేదన్న అధికారులు... అక్కడి నుంచి వెళ్లిపోవాలని పట్టుబట్టారు. దీంతో రాజ్యాంగాన్ని పట్టుకున్న లోకేశ్.. దాన్ని పోలీసులకు చూపిస్తూ ఎక్కడ అలాంటి రూల్స్ ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసుల వైఖరిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే పార్టీ శ్రేణులతో కూర్చొని ధర్నా చేశారు. ఆయన స్టూల్‌పై నిల్చొని తన అసంతృప్తిని పోలీసులకు తెలియజేశారు. దీంతో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పెనుగులాట కూడా జరిగింది. ఈ పెనుగులాటలో కొందరు టీడీపీ కార్యకర్తలు గాయపడినట్టు తెలుస్తోంది. తమ గ్రామంలోకి వచ్చిన లోకేశ్ మాట్లాడతామంటే పోలీసులకు అభ్యంతరం ఎందుకని స్థానికులు ప్రశ్నించారు.