TTD News: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన బుధవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి సర్వభూపాల వాహనంపై గజేంద్ర మోక్షం అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల గోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు. గురువారం ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడ వాహనంపై స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు.
సర్వభూపాల వాహనసేవలో సాంస్కృతిక శోభ
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన బుధవారం రాత్రి సర్వభూపాల వాహనసేవలో వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన కళాబృందాలు అద్భుత ప్రదర్శనలిచ్చారు. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 13 కళాబృందాలు, 329 మంది కళాకారులు పాల్గొని తమ సంగీత నృత్య ప్రదర్శనలతో భక్తులను పరవసింప చేశారు. శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థులచే నరకాసుర వధ నృత్య రూపకాన్ని ప్రదర్శించి భక్తులను అలరించారు. రాజమండ్రికి చెందిన పోసిరాణి బృందం డమరుక విన్యాసాలతో కనువిందు చేశారు. తిరుపతి నగరానికి చెందిన చందన కోలాట నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. తిరుమల బాలాజీ నగర్‌కు చెందిన శ్రీనివాసులు బృందకోలాటాలతో అలరించారు.
తిరుపతి నగరానికి చెందిన ధనశ్రీ శ్రీనివాస్ బృందం పురందరదాసు సంకీర్తనా నృత్య రూపకంతో అలరించారు. తిరుపతికి చెందిన మురళీకృష్ణ బృందం శ్రీకృష్ణ లీలా విశేషాలను తెలిపే వేషధారణతో భక్తులను అలరించారు. విశాఖపట్నంకు చెందిన సునీత బృందం కోలాటంతో అలరించారు. అనకాపల్లికి చెందిన ధనలక్ష్మి బృందం కోలాట నృత్యాలతో అలరించారు. హైదరాబాద్‌కు చెందిన గణేష్ బృందం గోండు నృత్యంతో కనువిందు చేశారు. అలాగే వికారాబాద్‌కు చెందిన అశోక్ బృందం తెలంగాణ జానపద కళారూపమైన థింసాను ప్రదర్శించారు. అనంతరం పులి వేషాలతో అలరించారు. తెలంగాణకు చెందిన లత బృందం వీరనాట్యాన్ని ప్రదర్శించి భక్తులను కనువిందు చేశారు. హైదరాబాదుకు చెందిన రాజి బృందం బతుకమ్మలతో ఆడిపాడారు.
రేపు సాయంత్రం గరుడ సేవ.. విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు
నవరాత్రి బ్రహ్మోత్సవాలలో అక్టోబరు 19న గురువారం గరుడసేవ జరుగనుంది. ఈ ఉత్సవానికి అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టామని టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్ తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో బుధవారం సాయంత్రం ఆయా రాష్ట్రాల కళాకారులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తులకు శ్రీవారి మూలమూర్తి దర్శనం, వాహనసేవ కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టామన్నారు. గ్యాలరీలు నిండిపోయి ఇన్నర్ రింగ్ రోడ్డులో వేచి ఉన్న భక్తులను మాడవీధుల్లోని కార్నర్లలో ప్రత్యేక క్యూలైన్ల ద్వారా అనుమతించి గరుడ వాహనం దర్శనం కల్పిస్తామని చెప్పారు.
అలాగే రాంభగీచా ప్రధాన మార్గం నుంచి వాహన మండపం వరకు వీఐపీలందరూ నడిచి వెళ్లాల్సి ఉంటుందని, వీరి కోసం బ్యాటరీ కార్లు ఏర్పాటు చేస్తున్నామని సీవీఎస్వో తెలిపారు. గరుడసేవ రోజున వీఐపీలు కూడా సహకరించాలని ఆయన కోరారు. అక్టోబరు 19న ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించామని, ఉద్యోగుల కోసం గ్యాలరీలు ఏర్పాటు చేశామని, అన్నప్రసాద వితరణ కోసం విస్తృత ఏర్పాట్లు చేపట్టామని, మొబైల్, లగేజీ డిపాజిట్, డెలివరీ కోసం లగేజీ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. మీడియా సమావేశంలో వీజీవోలు శ్రీ బాలిరెడ్డి, ఏవీఎస్వోలు మనోహర్, విశ్వనాథ్, సతీష్ పాల్గొన్నారు.