Tirumala laddu: ప్రస్తుతం ఏపీలో తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును వాడారని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా తిరుమల లడ్డూ కల్తీపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఆలయంలో ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామిని దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగానూ కోట్లాది మంది పూజిస్తారు. తిరుపతిలో ప్రసాదాల కల్తీ అంశం ప్రతి భక్తుడిని బాధపెడుతుంది. కల్తీపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడాలంటూ రాహుల్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. 






గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడి  భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిరుపతి వేంకటేశ్వర స్వామి భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ విషయంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ ఆరోపణలు చేయడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.  


ఆచార్య సత్యేంద్ర దాస్ స్పందన
తిరుపతి  లడ్డూ తయారీలో జంతు కొవ్వులు కలిపాయన్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని, దీనిపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని రామజన్మభూమి ఆలయ ప్రధాన అర్చకులు ఆచార్య సత్యేంద్ర దాస్ డిమాండ్ చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రామజన్మభూమి పూజారి మాట్లాడుతూ.. తిరుపతి లడ్డూ ప్రసాదంపై ఇప్పటివరకు జరిపిన విచారణలో చేపనూనె కలిపినట్లు నిర్ధారణ అయిందని, ఇది సనాతన ధర్మంపై జరుగుతున్న కుట్ర అని అన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని విచారణ జరిపి బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు.  ఇదిలా ఉండగా, శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యి నమూనాలను పరీక్షల నిమిత్తం గుజరాత్ లోని నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (NDDB) ల్యాబొరేటరీకి పంపగా.. పరీక్షల్లో కల్తీ నెయ్యి అని వెల్లడైంది.  


నాణ్యత లోపించింది : నారా లోకేష్
 తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. లడ్డూల నాణ్యత తగ్గిపోయిందని.. లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, కల్తీ నెయ్యి కమీషన్లను రికవరీ చేసి శ్రీవారి హుండీలో వేయించుకుంటామని మంత్రి నారా లోకేష్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో జరిగిన అవినీతిపై స్పష్టమైన ఆరోపణలు చేశామన్నారు. నెయ్యిని ఎన్‌డిడిఎఫ్‌కు పంపితే, అందులో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనె ఉన్నట్లు నిర్ధారించబడింది. ఈ నేపథ్యంలో తిరుపతిలో కల్తీ నెయ్యికి బాధ్యులెవరినీ వదిలిపెట్టబోమని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు.  కొత్తగా వచ్చిన టీటీడీ ఈవో లడ్డూ నాణ్యతను పెంచారు. వైసిపి ప్రభుత్వంలో చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఆయన రెడ్ బుక్ చూస్తే భయపడుతున్నారని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు.


Also Read: తిరుమల లడ్డూను కల్తీ చేసిన వారిని ఉరితీసినా తప్పులేదు - ఎంపీ బైరెడ్డి శబరి ఘాటు వ్యాఖ్యలు