Tiurpati MP Gurumurthy Allu Arjun getup : 
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవోపేతంగా జరుగుతోంది. ఆరో రోజు వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు మాతంగి వేషం ధరించి, పొంగళ్ళు సమర్పించి గంగమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. ఆరవ రోజు గంగమ్మ జాతర పురష్కరించుకుని తిరుపతి ‌ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గంగమ్మ భక్తి చైతన్య యాత్రను ఘనంగా నిర్వహించారు. 


అనంత వీధి‌లోని పూర్వపు తిరుమల ముఖద్వారానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గంగమ్మ సారెతో ఈ యాత్ర ప్రారంభంమైంది. ఐతే ఈ యాత్రలో తిరుపతి‌ ఎంపీ గురుమూర్తి పుష్ప-2 వేషధారణతో యాత్రలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పుష్ప సినిమా పార్ట్ 2లో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జన్ ధరించిన మాతంగి వేషంలో వైసీపీ ఎంపీ గురుమూర్తి, తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఐతే మాతంగి‌ వేషధారణలో ఉన్న ఎంపీ గురుమూర్తితో సెల్ఫీలు దిగేందుకు భక్తులు, తిరుపతి నగర ప్రజలు ఉత్సహాం చూపించారు. మాతంగి వేషధారణలో అనంత వీధి నుండి గంగమ్మ ఆలయం వరకూ ఎంపీ గురుమూర్తి డప్పు, మంగళ వాయిద్యాలు మధ్య నడుచుకుంటూ‌ వెళ్ళి గంగమ్మ అమ్మ వారిని దర్శించుకున్నారు. ఎంపీ గురుమూర్తి వేషధారణ ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.



ఏటా డిసెంబరు నెల వచ్చేసరికి గంగమ్మ జాతర గురించి చర్చల సందడి మొదలైపోతుంది. జాతర జరిగేది మే నెల మొదటి మంగళవారం అయినప్పటికీ...దాదాపు 4 నెలల ముందుగానే..అంటే డిసెంబరులో వచ్చే రెండో ఆదివారం అర్థరాత్రి చాటింపు వేసి తేదీలు ప్రకటించేస్తారు. ఎందుకంటే..ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా జాతర సమయానికి స్వస్థలాలకు చేరుకోవాలన్నది ఓ కారణం కాగా... వారం పాటూ వైభవంగా జరిగే జాతరకు ఏర్పాట్లు చేసుకోవాలంటే ఆమాత్రం సమయం ఉండాలి మరి. వందల సంవత్సరాలుగా సాగుతూ వస్తున్న ఈ జాతరకు కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు...ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రవాసులు కూడా భారీగా తరలివస్తారు. 


తిరుమల వేంకటేశ్వరుడికి చెల్లెలు గంగమ్మ


తిరుపతి నగరంలో కొలువు తీరిన ఏడుగురు అక్కా చెల్లెళ్ళు అంకాళమ్మ, మాతమ్మ, ఉప్పంగి మారెమ్మ, తాళ్ళపాక పెద గంగమ్మ, ముత్యాలమ్మ, వేషాలమ్మ, గంగమ్మలకు జాతర కైంకర్యాలు ఘనంగా నిర్వహిస్తారు. గంగమ్మను శ్రీ వేంకటేశ్వర స్వామికి చెల్లెలిగా భావిస్తారు. అందుకే టీటీడీ తరపున అమ్మవారికి పట్టుచీర సమర్పిస్తారు అధికారులు. మే నెల మెుదటి మంగళవారం అర్థరాత్రి కైకా వంశీయుల ఆధ్వర్యంలో చాటింపు కార్యక్రమంతో జాతర మెుదలవుతుంది..ఆ తర్వాత మంగళవారానికి జాతర పూర్తవుతుంది. అయితే ఈ వారం రోజులు మాత్రం ఊర్లోంచి ఎవ్వరూ పొలిమేర దాటి వెళ్లరు. 


చిత్ర విచిత్ర వేషాలు ఎందుకేస్తారంటే!


రాయలసీమలో పాలేగాళ్ళ రాజ్యం నడుస్తున్న రోజుల్లో తిరుపతిని పాలించే పాలెగాడి అరాచకత్వానికి అంతుండేది కాదు. తిరుపతి పాలెగాడి కన్నుపడిన  మహిళా తప్పించుకునే అవకాశం ఉండేది కాదు. ఆ కామాంధుడి బారినుంచి మహిళలను తప్పించేందుకు ప్రజలు నానా కష్టాలు పడేవారు. తిరుపతికి సమీపం అవిలాల గ్రామంలోని కైకాల కులస్థుల ఇంట్లో పుట్టిన ఓ ఆడబిడ్డను తిరుపతికి చెందిన ఓ వ్యక్తి దత్తత తీసుకున్నాడు..ఆమె పేరు గంగమ్మ. ఓ సారి పాలిగాడి కన్ను గంగమ్మపై పడింది... ఆమెను బలవంతం చేయబోతుండగా ఉగ్రరూపం దాల్చిన గంగమ్మ పాలెగాడిని సంహరించేందుకు వెంటాడింది. భయపడిన పాలెగాడు దాక్కున్నాడు..తనని బయటకు రప్పించేందుకు వారం రోజుల పాటూ రకరకాల వేషాలు వేసుకుని వెతికింది గంగమ్మ. బైరాగిగా, మాతంగిగా ఇంకా రకరకాల వేషాలు వేసుకుని తిరిగింది. చివరిగా దొర వేషంలో వెళ్లడంతో...తన దొరే వచ్చాడనుకుని పాలెగాడు బయటకు రావడంతో విశ్వరూపం చూపిన గంగమ్మ ఆ రాక్షసుడిని సంహరించింది. మరుసటి రోజు మాతంగి వేషధారణలో వెళ్లి పాలెగాడి భార్యని ఓదార్చుతుంది. దుష్టుడైన పాలెగాడిని సంహరించిన గంగమ్మ తల్లిని శక్తి స్వరూపిణిగా భావించి జాతర చేయడం ప్రారంభించారు.