భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సత్యసాయి జిల్లాలో పర్యటించారు. ఢిల్లీ నుంచి పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న ద్రౌపది ముర్ము అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సత్యసాయి ఆశ్రమం వద్దకు వెళ్లారు. పుట్టపర్తికి చేరుకున్న రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర మంత్రి ఉష శ్రీ చరణ్, పుట్టపర్తి ట్రస్ట్ సభ్యులు రత్నాకర్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి ప్రశాంతి నిలయానికి బయలుదేరారు. 


ప్రశాంతి నిలయంలో సత్యసాయి సమాధిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. ఆ తర్వాత పుట్టపర్తిలో సాయిహీరా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌కు రాష్ట్రపతి వెళ్లారు. సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ 42వ స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 14 మందికి డాక్టరేట్లు, 21 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. ఈ స్నాతకోత్సవంలో ఆమె ప్రసంగించారు. అనంతరం రోడ్డు మార్గంలో సత్యసాయి విమానాశ్రయానికి చేరుకొని.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిపోయారు.