TTD Latest News: తిరుమలలో మరోసారి టీటీడీ విజిలెన్స్ వైఫల్యం బయట పడింది. తిరుమలలో అన్యమత ప్రచారం, రాజకీయ పార్టీల ప్రచారం, పార్టీల గుర్తులు, జెండాలను తీసుకుని రాకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ కొందరూ టీటీడీ (TTD News) నిబంధనలను ఉల్లంఘిస్తూ భక్తుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారు. బుధవారం (నవంబరు 22) అన్యమతానికి సంబంధించిన పేర్లతో ఓ కారు తిరుమల రోడ్లపై చక్కర్లు కొట్టింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన TN 20DX 1324 నెంబర్ గల కారుపై అన్యమతాలకు చెందిన గుర్తులు, పేర్లు ఉన్నాయి.
దీన్ని టీటీడీ విజిలెన్స్ (TTD Vigilance) సిబ్బంది పట్టించుకోక పోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి ఆలయానికి సమీపంలోని అన్నదాన సత్రం సమీపంలో ఈ వాహనం చక్కర్లు కొడుతుంటే కొందరు భక్తులు వాహనం వీడియోలను తీశారు. అలిపిరి టోల్ గేట్ వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపుతుంటారు. అయితే కొందరు విజిలెన్స్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తరచూ అన్యమత గుర్తులు, పేర్లు కలిగిన వాహనాలు తిరుమలకు వస్తున్నాయి. విజిలెన్స్ సిబ్బంది నిర్లక్ష్యంపై భక్తులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
పార్వేటి మండపాన్ని పరిశీలించిన మంత్రాలయం పీఠాధిపతి
తిరుమల పాప వినాశనం మార్గంలోని పార్వేటి మండపాన్ని శ్రీ మంత్రాలయం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థ స్వామీజీ సందర్శించారు. శిథిలావస్థకు చేరుకున్న పార్వేటి మండపాన్ని కూల్చివేసి తిరిగి జీర్ణోద్ధరణ చేయడంపై కొందరు రాజకీయ నాయకులు విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నం పార్వేటి మండపం వద్దకు చేరుకున్న మంత్రాలయం పీఠాధిపతి మండపాన్ని సందర్శించి, మండపం నిర్మాణంలో క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ. పార్వేటి మండపాన్ని టీటీడీ జీర్ణోద్ధరణ చేసిందని, పార్వేటి మండపం జీర్ణోద్ధరణపై అనేక విమర్శలు చేశారని, సాంప్రదాయాలకు, శాస్త్రానికి ఎక్కడ లోటు లేకుండా మండపాన్ని టీటీడీ జీర్ణోద్ధరణ చేయడం ఆనందదాయకమని అన్నారు.
పురాతన కాలంలో నిర్మించిన చిన్న మండపాన్ని విశాలంగా టీటీడీ నిర్మించిందని, పాత మండపానికి చెందిన కొన్ని భాగాలను అలాగే నూతనంగా నిర్మించిన మండపంలో ఉంచడం జరిగిందని, అభివృద్ధిని పై విమర్శలు చేయడం తగదని అన్నారు. ముఖ్యంగా పవిత్ర పుణ్యక్షేత్రానికి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారని, అటువంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో భక్తుల మనోభావాలు ముడిపడి ఉంటుందని, ఏదైనా సలహాలు సూచనలు ఉంటే టీటీడీ అధికారులకు దృష్టికి తీసుకెళ్లాలని, అంతేకానీ బహిరంగంగా విమర్శలు చేయడం తగదని మంత్రాలయం పీఠాధిపతి సబుదేంద్ర తీర్థ స్వామీజీ తెలిపారు..