ఏడుకొండలపై గత నాలుగు రోజుల క్రితం ఐదేళ్ళ బాలుడు కిడ్నాప్ కలకలం రేపిన విషయం తెలిసిందే. కిడ్నాప్ కు గురైన బాలుడిని కిడ్నాపర్ తల్లిదండ్రులే పోలీసులకు అప్పగించడం ఆశ్చర్యానికి గురి చేసింది. గత నాలుగు రోజుల క్రితం మతిస్థిమితం లేని పవిత్ర అనే మహిళ తిరుమల శ్రీవారి ఆలయం ముందు కూర్చోని ఉన్న బాలుడిని కిడ్నాప్ చేసి మైసూరుకి తీసుకెళ్ళింది. అటుతరువాత ఆ మహిళ తల్లిదండ్రులు బాలుడిని తిరుమలకు తీసుకొచ్చి పోలీసులకు అప్పగించడంతో గోవర్ధన్ తల్లిదండ్రులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ నెల 1న సాయంత్రం తిరుమల శ్రీవారి ఆలయం ముందు దామినేడుకి చేందిన ఐదేళ్ళ బాలుడు గోవర్ధన్ కిడ్నాప్ కు గురి అయ్యాడు.. ఆలయంలో ముందు ఆడుకుంటున్న బాలుడిని గుర్తు తెలియని మహిళ కిడ్నాప్ చేసినట్లు బాలుడి తల్లి స్వాతి ఫిర్యాదు మేరకు సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు.. దీంతో అప్రమత్తంమైన టిటిడి విజిలెన్స్, పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కిడ్నాప్ కు గురైన బాలుడి ఆచూకీ కోసం గాలించారు.. ఐదేళ్ళ బాలుడికి కిడ్నాప్ చేసిన మహిళ బాలుడితో పాటుగా అదే రోజు సాయంత్రం 6:15 నిమిషాల సమయంలో తిరుమల బాలాజీ బస్టాండ్ లో బస్సు ఎక్కి తిరుపతికి బయలుదేరింది.. దాదాపు 7:15 నిమిషాలకు తిరుపతికి చేరుకున్న పవిత్ర, అక్కడ ఆ రాత్రి బస చేసింది. సోమవారం వేకువజామున తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకుని ట్రైన్ లో ప్రయాణం చేసింది. ఈ వివరాలను సీసీటీవీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు.
అయితే బృందాలుగా ఏర్పడిన పోలీసులు నెల్లూరు, కడప జిల్లాలతో పాటు మరికొన్ని ప్రదేశాల్లో బాలుడి ఆచూకీ కోసం గాలించారు. కానీ బాలుడి జాడ మాత్రం లభించలేదు. బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళ నేరుగా మైసూరుకి వెళ్ళింది. కిడ్నాప్ కి గురై దాదాపు 72 గంటలకు పైగా సమయం గడవడంతో బాలుడి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. బాలుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తూ ఉండగానే బాలుడి కిడ్నాప్ కేసు ఎవరూ ఊహించని మలుపు తిరిగింది.
కిడ్నాప్ గురైన బాలుడిని కిడ్నాప్ చేసిన పవిత్ర అనే మహిళ తల్లిదండ్రులే ఇవాళ ఉదయం (మే 5) బాలుడిని తిరుమలకు తీసుకొచ్చి పోలిసులకు అప్పగించారు. బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళ పవిత్ర మతిస్తిమితం సరిగా లేకపోవడంతో పాటు ఆమె 15 రోజుల క్రితం తప్పిపోయినట్లు పవిత్ర తల్లిదండ్రులు మైసూరులో పోలిసులకు ఫిర్యాదు చేశారు..కొద్ది రోజుల క్రితం తప్పిపోయిన పవిత్ర దాదాపు 15 రోజుల తరువాత ఇంటికి చేరుకోవడంతో పవిత్ర తల్లిదండ్రులు ఊపీరి పీల్చుకున్నారు.. అయితే పవిత్ర తనతో పాటు ఓ బాలుడిని తీసుకు రావడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన పవిత్ర తల్లిదండ్రులు ఇదే విషయాన్ని పోలిసులకు సమాచారం అందించారు.. అప్పటికే తిరుమలలో బాలుడు కిడ్నాప్ కు గురైన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు.. కిడ్నాప్ కు గురైన బాలుడు గోవర్ధన్ నే పవిత్ర తీసుకొచ్చినట్లు గుర్తించి ఇదే విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలియజేయడంతో పవిత్ర తల్లిదండ్రులే పవిత్రతో సహా గోవర్ధన్ ను తిరుమలకు తీసుకొచ్చి పోలీసుల సమక్షంలో బాలుడిని గోవర్ధన్ తల్లి స్వాతికి అప్పగించారు.. తప్పిపోయిన తన కొడుకు దొరక్కడంతో బాలుడి తల్లి పట్టలేని సంతోషానికి లోనైంది.. తన బాలుడిని తనకు అప్పగించిన పోలీసులకు బాలుడి తల్లి స్వాతి కృతజ్ఞతలు తెలిపింది.