చిన్న చిన్న కారణాలకే బలవన్మరణానికి పాల్పడుతున్నారు చాలా మంది యువతరం. ఇంట్లో వాళ్లు మందలించారనో, కాలేజీలో మార్కులు తక్కువ వచ్చాయనో, ప్రేమించిన వారు మోసం చేశారనో, వ్యాపారంలో నమ్మిన వారు మోసగించారనో ఇలా రకరకాల కారణాలతో తీవ్ర మనోవేదనకులోనే నిండు ప్రాణాలు తీసుకుంటున్నారు. అలాంటి సంఘటనే చిత్తూరు జిల్లాలో జరిగింది. 


చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణానికి చెందిన బంగారు దుకాణం యజమాని నాగరాజు కుమారుడే తరుణ్(26) బిటెక్ వరకూ చదువుకున్నాడు. చిన్నతనం నుంచి ఉద్యోగం కంటే వ్యాపారంపై తరుణ్‌కు ఆసక్తి. చదువు పూర్తి చేసి తండ్రిలా వ్యాపారం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. తల్లిదండ్రులు మాత్రం ఉద్యోగం చేసుకోవాలని సూచించారు. వ్యాపారం వద్దని తరుణ్‌ను ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ అందుకు తరుణ్ ఒప్పులేదు.‌ 
ఎన్ని విధాలుగా నచ్చజెప్పినా తరుణ్‌ మనసు మార్చుకోలేదు. పెళ్లి చేస్తే మారుతాడని ఉద్యోగంలో స్ధిర పడుతాడని ఆశించారు. అనుకున్నట్టుగానే గతేడాది ఓ యువతితో వివాహం నిశ్చయించారు. లగ్న పత్రికల కార్యక్రమం కూడా వేడుకగా నిర్వహించారు. ఆ టైంలో కూడా తను ఉద్యోగం చేయబోనని వ్యాపారమే చేస్తానని చెప్పేశారు. దీంతో ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది.  


అప్పటి నుంచి ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తరుణ్, తల్లిదండ్రుల మధ్య వాగ్వాదం నడుస్తూనే ఉంది. బంధుమిత్రుల వద్ద కూడా పంచాయితీ పెట్టారు. తరుణ్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తరుణ్ వినిపించుకోలేదు. స్నేహితులతో తిరిగి చెడిపోతున్నాడని అనుమానంతో తరుణ్‌ను రకరకాలుగా వేధించడం స్టార్ట్ చేశారు. 


తీవ్ర మనోవేధనకు గురైన తరుణ్‌... సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పుంగనూరులోని‌ ఓ లాడ్జ్‌లో రూం అద్దెకు తీసుకొని తనువు చాలించాడు. లాడ్జ్‌లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. తన తల్లిదండ్రులకు కన్నబిడ్డ కంటే డబ్బే ముఖ్యమని, వారి వేధింపులు తాళ్ళ లేక బలవన్మరణానికి పాల్పడుతున్నాని వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టాడు. కనీసం సారీ చెప్పేందుకు కూడా ఇంటికి రానీయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.


ఒక్కరాత్రి కోసం రూం తీసుకున్న తరుణ్‌ మధ్యాహ్నం అయినా బయటకు రాలేదని లాడ్జ్‌ సిబ్బందికి అనుమానం వచ్చింది. వెళ్లి చూస్తే తరుణ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని ఉన్నాడు. లాడ్‌ సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న పోలీసులు తరుణ్‌ సూసైడ్‌పై దర్యాప్తు చేస్తున్నారు.