Tirumala News Today: తిరుమల: ప్రధాని నరేంద్ర మోదీ తిరుమల పర్యటన (PM Modi Tirumala Tour)పై వివాదం నెలకొంది. శేష వాహనం ముందు ప్రధాని మోదీకి ప్రసాదం ఇవ్వడంపై రాజకీయాలు చేయడం దౌర్భాగ్యమని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (TTD chairman Bhumana Karunakar Reddy) అన్నారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో గల శేష వాహనం ముందు వివిఐపిలకు శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటం ఇవ్వడం, వారిని అడిగి ఫొటోలు తీసుకోవడం జరుగుతుంటుంది. అనంతరం వీటిని మీడియాకు, వివిఐపిలకు కూడా పంపడం ఆనవాయితీగా వస్తోందని టీటీడీ (TTD) ఛైర్మన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీన్ని కూడా కొందరు  రాజకీయం చేసి విమర్శలకు దిగడం దౌర్భాగ్యం అన్నారు.


ఈ సంప్రదాయంలో భాగంగానే సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో దేశ ప్రధాని మోదీకి వేదపండితులు ఆశీర్వచనం చేశారన్నారు. తానే ప్రధానిని ఆహ్వానించి అక్కడ వారికి స్వామివారి ప్రసాదాలతో పాటు టీటీడీ కాఫీ టేబుల్ బుక్, పంచగవ్య ఉత్పత్తులు, 2024 డైరీ, క్యాలెండర్, స్వామివారి చిత్రపటం అందించానని వివరించారు. ఆశీర్వచనం తరువాత తానే ప్రధాని మోదీని ఆహ్వానించి ఫొటోలు తీసుకున్నానని తెలిపారు.






కానీ, కొంతమంది స్వామివారి శేష వాహనం ముందు ఇలా చేయడం సరికాదని ప్రచారం చేయడం సబబు కాదని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఆలయానికి వచ్చే వివిఐపీలకు రంగనాయకుల మండపంలోని శేష వాహనం ఎదుట స్వామివారి ప్రసాదాలు, చిత్రపటం తదితరాలు ఇవ్వడం, వారిని అడిగి  ఫొటోలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. వీటినే మీడియాకు పంపడమనేది ఆనవాయితీగా వస్తోందని భూమన పేర్కొన్నారు. శ్రీవారి దర్శనం తరువాత వివి ఐపిలు, విఐపిలు  రంగనాయకుల మండపంలోని శేష వాహనం ముందే ఫోటోలు తీసుకునే ప్రదేశం అన్నారు.  అయితే కొందరు వ్యక్తులు ఈ విషయాన్ని కూడా వివాదాస్పదం చేయాలనుకోవడం దౌర్భాగ్యమన్నారు. దేవుడి దర్శనాన్ని కూడా రాజకీయం చేసి  విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి  దుర్మార్గపు ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని టీటీడీ ఛైర్మన్ భూమన కోరారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply