Modi in Tirumala: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం (నవంబర్ 26) తిరుమలకు రానున్న నేపథ్యంలో కేంద్ర బలగాలతో పాటు ఏపీ పోలీసు ఉన్నత ఉన్నతాధికారులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మోదీ వెంట గవర్నర్ అబ్దుల్ నజీర్ రానున్న క్రమంలో తిరుమల వ్యాప్తంగా పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రముఖులు బస చేసే అతిథి గృహాలను ఇప్పటికే ఎన్ ఎస్ జీ బలగాలు తమ ఆధీనంలో తీసుకున్నాయి. ప్రధాని ఏ మార్గాలు అయితే ప్రయాణిస్తారో ఆ మార్గాల్లో బారీకేడ్లు ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాల ఉన్నతాధికారులు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ఆలయం ఇతర ప్రవేశాలను టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డితో కలిసి పరిశీలించారు.
2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రధాని మోదీ 2015, 2017, 2019లో శ్రీవారిని దర్శించుకున్నారు. 2023 నాలుగో పర్యాయం మోదీ తిరుమలకు వస్తున్నారు. ప్రధాని మోదీ తిరుమల, తిరుపతి పర్యటన క్రమంలో కాన్వాయ్ ట్రైలర్ శనివారం రాత్రి నిర్వహించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమలలోని రచన గృహం వరకు. అటు తరువాత శ్రీవారి ఆలయం వరకు ట్రైల్ రన్ కొనసాగింది. ఇప్పటికే అటు కేంద్ర ఇటు రాష్ట్ర పోలీసు బలగాలు తిరుమలను జల్లెడ పట్టారు.
ప్రధాన మంత్రి పర్యటనలో పార్టీల ఫ్లెక్సీల గోల?
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయం నుంచి అలిపిరి వరకు భారీ స్థాయిలో ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.. పార్టీలతో సంబంధం లేకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి స్వాగత తోరణాలలా అడుగడుగునా స్వాగతం పలుకుతున్నారు.. బీజేపీ, అధికార వైసీపీ పార్టీ నేతలు రోడ్డుకు ఇరు వైపులా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం, ఇరు పార్టీల మధ్య ఫ్లెక్సీ వార్ షురు అయ్యింది.. ఇక అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, ఎమ్మెల్యే అనుచరులు తొలగించాలని హుకుం జారీ చేశారు.. దీంతో రేణిగుంట తాసిల్దార్ దగ్గరుండి గవర్నమెంట్ ఫ్లెక్సీలను తొలగించి, పార్టీ ఫ్లెక్సీలు పెడుతున్నారు..