AP Polytechnic Colleges: ఏపీలో 9 పాలిటెక్నిక్ కళాశాలల్లో 16 బ్రాంచ్‌లకు నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ (National Board of Accreditation) గుర్తింపు లభించింది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి నవంబరు 25న ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను ఉన్నత స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. మొదటి దశలో 41 పాలిటెక్నిక్‌లకు ఎన్‌బీఏ కోసం ప్రయత్నించగా ఇప్పటి వరకు 18 పాలిటెక్నిక్‌లకు ఈ గుర్తింపు లభించిందని నాగమణి తెలిపారు.
రానున్న రెండు నెలల్లో మరో 11 పాలిటెక్నిక్‌లకు ఎన్‌బీఏ లభించే అవకాశం ఉందన్నారు. ఇందుకు సంబంధించిన పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఆమె తెలిపారు. అన్ని పాలిటెక్నిక్ కళాశాలల్లోనూ ఆన్‌లైన్ కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని, మౌలికసదుపాయాల కల్పనకు చర్యలు తీసుకున్నామని నాగమణి వెల్లడించారు. 2024-25 విద్యాసంవత్సరం నాటికి 43 పాలిటెక్నిక్ కళాశాలలకు ఎన్‌బీఏ గుర్తింపు వచ్చేలా కృషి చేస్తున్నామని విద్యాశాఖ కమిషనర్ స్పష్టం చేశారు.
9 కాలేజీలు ఇవే: ఈఎస్‌సీ గవర్నమెంట్ పాలిటెక్నిక్- నంద్యాల, గవర్నమెంట్ పాలిటెక్నిక్-కలికిరి, గవర్నమెంట్ పాలిటెక్నిక్-పార్వతీపురం, గవర్నమెంట్ పాలిటెక్నిక్-రాజంపేట, గవర్నమెంట్ పాలిటెక్నిక్-కాకినాడ, గవర్నమెంట్ పాలిటెక్నిక్- ధర్మవరం, గవర్నమెంట్ పాలిటెక్నిక్-చంద్రగిరి, ఎంబీటీఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్-గుంటూరు, గవర్నమెంట్ పాలిటెక్నిక్- ఆత్మకూరు.
దివ్యాంగ విద్యార్థులకు కళలు, క్రీడల్లో శిక్షణ..
దివ్యాంగ విద్యార్థులకు చదువుతో పాటు కళలు, క్రీడల్లోనూ శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు.. ఉపాధ్యాయులకు సూచించారు. నవంబరు 24న ఆ శాఖ రాష్ట్ర కార్యాలయంలో 50 మంది ఉపాధ్యాయులకు పైలట్ ప్రాజెక్టులో భాగంగా ‘అడాప్టివ్ ఆర్ట్ కిట్’ను అందించారు. ప్రత్యేక ఉపాధ్యాయుల కోసం ఎల్‌ఎఫ్‌ఈ(లీడర్‌షిప్ ఫర్ ఈక్విటీ) బృందం రూపొందించిన ఈ కిట్ బోధన సామర్థ్యాలు మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందన్నారు. అనంతరం ఐఈఆర్పీలకు, ప్రత్యేక ఉపాధ్యాయులకు కోర్సు సర్టిఫికేట్లు ప్రదానం చేశారు.
అయిదు వర్సిటీలకు ఇన్‌ఛార్జి వీసీల నియామకం..
ఏపీలో 5 యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జి వీసీలనను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడున్న ఉపకులపతుల పదవీకాలం పూర్తి కావడంతో ఇన్‌ఛార్జులను నియమించింది. ఆంధ్ర వర్సిటీకి రెక్టార్ సమత, శ్రీవేంకటేశ్వరకు విక్రమసింహపురి వర్సిటీ వీసీ సుందరవల్లి, శ్రీకృష్ణదేవరాయకు యోగి వేమన వర్సిటీ వీసీ చింతసుధాకర్, రాయలసీమకు డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ వర్సిటీ వీసీ ఫజుల్ రహ్మన్, ద్రవిడ వర్సిటీకి పద్మావతి మహిళా వర్సిటీ వీసీ భారతిని ఇన్‌ఛార్జీలుగా నియమించారు. రెగ్యులర్ ఉపకులపతులను నియమించేందుకు మూడు నెలల ముందు ప్రకటనలు ఇచ్చినా.. ప్రభుత్వం వీసీల పదవీకాలం పూర్తయ్యేలోపు కొత్తవారిని నియమించలేకపోయింది.
వర్సిటీ నియామకాల కేసుల పరిశీలనకు కమిటీ ..
విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి చేపట్టిన ప్రక్రియపై హైకోర్టులో వేసిన కేసుల వ్యవహారాలను పరిశీలించేందుకు ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వర్సిటీల్లో ప్రొఫెసర్, అసోసియేట్, సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి నిర్వహించిన పోస్టుల హేతుబద్ధీకరణ, రిజర్వేషన్ రోస్టర్ అమలు తదితర అంశాలపై హైకోర్టులో మొత్తం 6 కేసులు వేశారు. వీటిపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం, సకాలంలో కౌంటర్ దాఖలు చేసేలా చూసేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సాధారణ పరిపాలన శాఖ అదనపు కార్యదర్శి శ్రీనివాసులు, ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ రామమోహనరావు, లీగల్ కన్సల్టెంట్ సుధేష్ ఆనంద్, ఆయా వర్సిటీల రిజిస్ట్రార్లు, స్టాండింగ్ కౌన్సిళ్లు సభ్యులుగా ఉండగా.. ఉన్నత విద్యాశాఖ డిప్యూటీ కార్యదర్శి వెంకటేశ్వరరావు కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు.
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply