Peetadipati of Vishaka Sri Sarada Peetham Swaroopanandendra Saraswati: తిరుపతి : హిందూ ధర్మం అంటే పూజలకే పరిమితం కాదు అని, అందరికీ అర్థమయ్యేలా జ్ఞానబోధ చేస్తామన్నారు విశాఖలోని శ్రీ శారదాపీఠం అధిపతి సర్వరూపానందేంద్ర సరస్వతి. తిరుమల శ్రీవారి పాదాల చెంత శారదా పీఠాధిపతి స్వధర్మ వాహిని ట్రస్టు లోగో ఆవిష్కరించారు. గిరిజన ప్రాంతాల్లో సనాతన హిందూ ధర్మప్రచారానికి స్వధర్మ ట్రస్టు నిరంతరం కృషి చేసేందుకు స్థాపించామని చెప్పారు. తిరుమలలోని శ్రీ విశాఖ శారదా పీఠంలో స్వరూపానంద సరస్వతి మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఏపీ, తెలంగాణలలో ధర్మ ప్రచారం చేసేందుకు సరైన సంస్థలు లేవని తెలిపారు.


స్వామీజీలు ప్రసంగాలకే పరిమితం..
చాలామంది స్వామీజీలు పట్టణ ప్రాంతాల్లో ఆశ్రమాలు నిర్మించుకొని, అక్కడే చేసే ప్రసంగాలకే పరిమితమయ్యారని స్వరూపానందేంద్ర సరస్వతి విమర్శించారు. గ్రామీణ స్థాయి, గిరిజన ప్రాంతాల్లో ధర్మ ప్రచారం జరగడం లేదని అభిప్రాయపడ్డారు. విదేశీ సంస్థలు గిరిజన ప్రాంతాల్లో ప్రజల జీవితాలను చిదిమేస్తున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకే ధర్మ ప్రచారం విస్తృతంగా చేసేందుకు స్వధర్మ వాహిని ట్రస్టును ప్రారంభిస్తున్నామని శారదా పఠాధిపతి స్పష్టం చేశారు.  హిందూ ధర్మం అంటే పూజలకే పరిమితం కాదు, జ్ఞాన వాహిని అని అర్థమయ్యేలా గిరిజనులకు జ్ఞానబోధ చేస్తామన్నారు. ఈరోజు నుండి విశాఖ శారద పీఠం అనుబంధ సంస్థగా స్వధర్మ వాహిని ధర్మ ప్రచారం చేస్తుందని చెప్పారు. 


స్వధర్మ వాహిని ట్రస్టు గిరిజనులు విదేశీ మతాలకు లొంగకుండా పని చేస్తుందని తెలిపారు. పూర్తి స్వయం ప్రతిపత్తితో ఈ ట్రస్టు కార్యకలాపాలు నిర్వహిస్తుందన్నారు. త్రివర్ణాలతో ఈ ట్రస్ట్ ఉంటుందని వాటి విశిష్టతను ఈ సందర్భంగా ఆయన వివరించారు. పసుపు, కుంకుమ, తెలుపు వర్ణాలు ట్రస్ట్ కు సంకేతాలని చెప్పారు. అందులో పసుపు మనిషిలో ఉన్న కల్మషాన్ని, కుతంత్రాన్ని పోగొడుతుందన్నారు. తెలుపు ధర్మ పథంవైపు మనల్ని నడుపుతోందన్నారు. కుంకుమ జ్ఞాన నేత్రానికి సంకేతమమని తెలిపారు. 


హిందూ ధార్మికతపై ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేసి హిందూ మత వైభవాన్ని గిరిజనులకు తెలియజేస్తామని అన్నారు. కుళ్లు పట్టిన కులాలు అనే అంటూ హిందూ మతంలో లేదని చెప్పే ధర్మ వాహిని.... స్వధర్మ వాహిణిగా ఆయన అభివర్ణించారు. విదేశాల్లో స్వదేశంలో ఉన్న శారదా పీఠం భక్తులు ట్రస్ట్ కార్యకలాపాల్లో పాల్గొంటారన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)కి మాకు ఎలాంటి సంబంధం లేదని, మా సంస్థ ప్రైవేట్ ధార్మిక సంస్థ అని స్పష్టం చేశారు. రేపు శ్రీవారి దర్శనం అనంతరం టీటీడీపై ఏమైనా విషయాలు అడిగితే ఆ ప్రశ్నలకు బదులిస్తానని మాట్లాడుతానని స్వరూపానందేంద్ర సరస్వతి చెప్పారు.