తిరుమలలో ఆఫ్ లైన్ విధానంలో శ్రీవారి ఆర్జితసేవలు, బ్రేక్ దర్శనం పొందిన భక్తులు టికెట్లు పొందే ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు టీటీడీ నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. "పే లింక్" ఎస్ఎంఎస్ ద్వారా భక్తులు కౌంటర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లను ప్రింట్ తీసుకోవచ్చు. భక్తులకు మెరుగైన, సత్వర, సులభ సేవలు అందించడంలో భాగంగా ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.


ఇప్పటి వరకు సీఆర్ఓలో లక్కీడిప్ ద్వారా ఆర్జిత సేవాటికెట్లను భక్తులకు కేటాయించేవారు. ఈ విధానంలో టికెట్లు పొందిన భక్తులు కౌంటర్ వద్దకు వచ్చి సొమ్ము చెల్లించి టికెట్లు పొందాల్సి వచ్చేది. దీంతో పెద్దలు, పిల్లల తల్లిదండ్రులు క్యూలో ఉండాల్సి వచ్చేది. టీటీడీ కొత్తగా తీసుకొచ్చిన పే లింక్ నూతన విధానంలో టికెట్లు పొందిన భక్తులకు ఎస్ఎంఎస్ ద్వారా పే లింక్ ను పంపుతారు. భక్తులు ఆ లింక్ పైన క్లిక్ చేసి యుపీఐ లేదా క్రెడిట్ కా, డెబిట్ కార్డు ద్వారా ఆన్‌లైన్‌లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లు ప్రింట్ తీసుకోవచ్చు. ఈ నూతన విధానాన్ని ప్రస్తుతం సీఆర్వోలోని లక్కీడిప్ కౌంటర్ల వద్ద ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. త్వరలో ఎంబీసీ-34 కౌంటర్ వద్ద విచక్షణ కోటాలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లు, బ్రేక్ దర్శన టికెట్లకు కూడా ఈ విధానం అమలుకానుంది.


తాళపత్రాల డిజిటలైజేషన్‌పై ఈఓ సమీక్ష
శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంతో  ఎంఓయులు  చేసుకుని వారి వద్ద ఉన్న తాళపత్రాలను డిజిటైజ్ చేయాలని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆదేశించారు. శ్రీ వేంకటేశ్వర మ్యాన్ స్క్రిప్ట్స్ ప్రాజెక్ట్ ప్రగతిపై  ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో  గురువారం ఆయన సమీక్ష  జరిపారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఇప్పటిదాకా డిజిటైజ్ చేసిన తాళపత్రాల్లో సమాజానికి ఉపయోగ పడే అంశాలున్న వాటిని పుస్తక రూపంలో తేవడానికి  చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇందుకోసం అవసరమైనంత మంది స్కాలర్స్‌ను నియమించుకోవాలని సూచించారు. 


తాళ పత్రాల సేకరణకు సంబంధించిన ఆరు నెలల ప్రణాళిక తయారు చేసుకుని  దానికి అనుగుణంగా  పని చేయాలన్నారు. తాళపత్రాల్లో మిస్ అయిన అక్షరాలను  పొందుపరచగలిగే  సాఫ్ట్ వేర్ ను  ఏర్పాటు చేసుకోవడానికి సంబంధిత వ్యక్తులతో చర్చించాలని  ఈవో సూచించారు. ప్రస్తుతం ఉన్న తాళపత్ర బండిల్స్ లో మిగిలిన  సుమారు  వెయ్యి బండిల్స్ ను రాబోయే మూడు నెలల్లో స్కానింగ్ పూర్తి చేయాలని ఈవో  చెప్పారు. 


తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
తిరుమలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం ఉదయం నాటికి 18 కంపార్టుమెంట్లలో భక్తుల స్వామివారి దర్శనానికి వేచి ఉన్నారు. భక్తుల రద్దీ పెరగడంతో శ్రీవారి దర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. బుధవారం ఒక్కరోజులో 74 వేల మంది భక్తులు శ్రీవారిని  దర్శించుకున్నారు. 32,688 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల నుంచి రూ.3.96 కోట్ల హుండీ ఆదాయం లభించింది. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial