Nara Lokesh Yuvagalam Padayatra : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ అసమర్థ పాలన వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. సీఎం జగన్ అవగాహన లేమి, వర్షా కాలంలో కనీస అంచనాలు లేకుండా జగన్ ప్యాలస్ లో పడుకోవడం వల్ల అన్నమయ్య డ్యాం కొట్టుకు పోయిందన్నారు. 60 మందిని సీఎం జగన్ పొట్టన పెట్టుకున్నారంటూ లోకేష్ మండిపడ్డారు. నీటి నిర్వహణ లో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 


28వ రోజు పాదయాత్రలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలోని తనపల్లి లో వరదలకు కొట్టుకుపోయిన లెవల్ కాజ్ వేని నారా లోకేష్ ఆదివారం పరిశీలించారు. 2021 నవంబర్ నెలలో వచ్చిన భారీ వరదలకు స్వర్ణ ముఖి నదిపై ఉన్న 7 లో లెవల్ కాజ్ వే లు కొట్టుకుపోయాయని స్థానికులు టీడీపీ నేత లోకేష్ కు వివరించారు. పైపులు, మట్టి పోసి పైన రోడ్డు పోసారే తప్ప, పూర్తిస్థాయిలో పటిష్టమైన కాజ్ వే లు నిర్మించలేదని  స్థానికులు అన్నారు. మళ్లీ వరద వస్తే నాణ్యత లేకుండా వేసిన పైపులు, మట్టి కొట్టుకు పోవడంతో పాటు ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని తనపల్లి ప్రజలు లోకేష్ కు వివరించారు. కాజ్ వేలు కొట్టుకుపోయి ఏడాదిన్నర కావస్తున్నా, ఏపీ ప్రభుత్వం ఈ పనులకు నిధులు కేటాయించలేదన్నారు. స్థానికుల సమస్యలు విన్న అనంతరం లోకేష్ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని, పటిష్టమేన కాజ్ వేలు నిర్మిస్తామని వారికి హామీ ఇచ్చారు.






గ‌జ‌మాల‌తో లోకేష్‌కి ఆత్మీయ స‌త్కారం
చంద్రగిరి నియోజకవర్గం తిరుచానూరు సర్కిల్ విడిది కేంద్రం నుంచి ఆరంభ‌మైన పాద‌యాత్రకి టీడీపీ అభిమానులు ఘనస్వాగతం పలికారు. పాదయాత్రలో గ‌జ‌మాల‌తో నారా లోకేష్‌కి ఆత్మీయ స‌త్కారం చేశారు  తిరుచానూరు  శ్రీ పద్మావతి అమ్మవారిని ద‌ర్శనం చేసుకొని ప్రత్యేక పూజా కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. ప్రజ‌ల‌కి అభివాదం చేస్తూ, వృద్ధుల‌ని ప‌ల‌క‌రిస్తూ పాద‌యాత్రలో ముందుకు సాగారు.


లోకేష్ కు మద్దతుగా సైకిల్ యాత్ర..
నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర 28వ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. అయితే లోకేశ్​ చేపట్టిన యువగళం పాదయాత్రకు మద్దతుగా తెలుగు యువత ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర చేపడుతున్నట్లు రాష్ట్ర కార్యదర్శి లింగారెడ్డి చెప్పారు. మార్చి 7 నుంచి 3 రోజులపాటు అనంతపురం నుంచి మదనపల్లి వరకు తెలుగు యువత సైకిల్ యాత్ర సాగుతుందని తెలిపారు. 


వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా, ప్రజలను మభ్య పెట్టినా ఈ సారి టీడీపీ విజయం సాధిస్తుందన్నారు. ఏపీకి నెక్ట్స్ సీఎం చంద్రబాబే.. రాసిపెట్టుకో జగన్ రెడ్డి అని యువగళంలో వ్యాఖ్యానించారు. అప్పుల కుప్పగా ఆంధ్రాని మార్చిన సీఎం జగన్.. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దిగజారుతుందని.. అథఃపాతాళంలోకి ప‌డిన రాష్ట్రాన్ని చక్కదిద్దగలిగేది ఒక్క చంద్రబాబే అన్నారు.