ప్రభుత్వానిది ధనబలం.. తమది ప్రజాబలం అని నారా భువనేశ్వరి అన్నారు. 2024లో జరిగే కురుక్షేత్ర సంగ్రామంలో టీడీపీ- జనసేన విజయం తథ్యమని అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జైల్లో పెట్టారని, 49 రోజులుగా ఒక్క రుజువు కూడా చూపించలేదని మండిపడ్డారు. పేదలకు పండుగ కానుకలు ఇవ్వడం, అన్నా క్యాంటీన్ ద్వారా పేదల కడుపు నింపడం చంద్రబాబు చేసిన తప్పా అని ప్రశ్నించారు. నాడు మనరాష్ట్రం అభివృద్ధిలో నెంబర్ వన్ అయితే..నేడు అవినీతి, దోపిడీలో నంబర్ వన్ అని విమర్శించారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు శ్రీకాళహస్తిలో శుక్రవారం నిర్వహించిన బహిరంగలో భువనేశ్వరి మాట్లాడారు. అంతకముందు వేదికపై ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
అనంతరం భువనేశ్వరి మాట్లాడుతూ...‘‘నేను ఇక్కడకు చంద్రబాబు భార్యగానే కాదు.. ఒక భారత నారీగా నిజం గెలవాలని ఈ పోరాటం మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ పోరాటం నాదొక్కదానిదే కాదు..ఈ పోరాటం ప్రజలదని గుర్తుచేస్తున్నా. కొంతమంది నా స్నేహితులు అడిగారు..నిజం గెలవాలి పోరాటానికి ఎందుకు వెళ్తున్నావు...రాష్ట్రంలో అరాచకం, హింస, వింటున్నామని చెప్పారు. కానీ ఈ మూడు రోజులు ప్రజలోకి వచ్చాక వచ్చాక నాపై టీడీపీ బిడ్డలు, ప్రజలు చూపించిన ఆదరణ, అభిమానం, ప్రేమ నాకు శ్రీరామ రక్ష. అవే నాకు రక్షణ కవచం. అన్న ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు ఆత్మగౌరవ ఇచ్చారు..చంద్రబాబు ఆత్మవిశ్వాసం ఇచ్చారు. ప్రజల కోసం పోరాడే నాయకుడు చంద్రబాబు. ఎప్పుడూ ప్రజలు, రాష్ట్ర అభివృద్ధికి కష్టపడే వ్యక్తి. అలాంటి వ్యక్తిని నిర్బంధించి 49 రోజులు అయింది. చంద్రబాబు ప్రజల సొమ్ముతిన్నారని ప్రజలుకానీ, కార్యకర్తలు కానీ ఎవరూ నమ్మడం లేదు. ఎందుకంటే 49 రోజులుగా ప్రభుత్వం ఒక్క రుజువు కూడా చూపించలేకపోయింది. మొదట రూ.3 వేల కోట్ల అవినీతి జరిగిందని, తర్వాత రూ.371 కోట్ల అవినీతి అని, ఇప్పుడు రూ.27 కోట్లు అవినీతి జరిగిందని చెప్తున్నారు. కేసు నమోదు చేసినా ఇప్పటి వరకు రుజువులు లేవు..దీన్ని బట్టి చూస్తే ఇదీ ఈ ప్రభుత్వం చేసే అరాచకం. చంద్రబాబు అభివృద్ధి చేయడం తప్పా. రాష్ట్రమే కటుంబంగా కష్టబడటం తప్పా.?
ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడం తప్పా.? నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వడం తప్పా.? అమరావతి రాజధాని కట్టడం..పోలవరం నిర్మించడం తప్పా.? రాయలసీమకు కియా కార్ల పరిశ్రమను తీసుకురావడం తప్పా.? యువతకు ఉద్యోగాల కోసం స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయడం తప్పా.? మహిళలకు పసుపుకుంకుమ, తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ పథకాలు తీసుకురావడం తప్పా. అన్నా క్యాంటీన్, పేదలకు పండుగ కానుకలు ఇవ్వడం తప్పా? చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఏపీ అంటే అభివృద్దిలో టాప్. కానీ ఇప్పుడు అరాచకం, అక్రమ కేసులు, రాజకీయ దాడుల్లో టాప్ గా ఉంది. రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు, గంజాయి, నిరుద్యోగుల ఆత్మహత్యల్లో రాష్ట్రం టాప్ లో ఉంది. ఏపీ అంటే సెటిల్ మెంట్లు, భూ దందాలు, కమీషన్ల కోసం కంపెనీలను బెదరగొట్టడం, విద్యుత్ బిల్లు అడిగితే కేసులు పెట్టడంలో రాష్ట్రం టాప్ లో ఉంది. నిత్యవసర సరుకుల ధరలు ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా.. రాజధాని, దిక్కూ, మొక్కూలేని రాష్ట్రం. కార్యకర్తలు ర్యాలీలు తీసినా కేసులు పెడుతున్నారు. పుంగనూరు ఘటన మీకు తెలుసు. శ్రీకాకుళానికి చెందిన టీడీపీ బిడ్డలు సైకిల్ ర్యాలీ చేస్తే చొక్కాలు చించి, జెండాలు పీకేశారు. ప్రజల సహకారంతో టీడీపీ బిడ్డలు ఎప్పుడూ ముందుకు సాగుతారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎంతో గొప్పది.
చంద్రబాబు చాలా స్ట్రాంగ్ పర్సన్
దేశాన్ని రాజ్యాంగమే నడిపిస్తుంది. అంబేద్కర్ చెప్పిన మంచిమాట మీకు చెప్తాను...రాజ్యాంగం ఎంత గొప్పది అయినా అమలు చేసే వ్యక్తి మంచి వారు కాకపోతే రాజ్యాంగం మంచి ఫలితాలు ఇవ్వదు..రాజ్యాంగంలో లోపాలున్నా అమలు చేసేవాళ్లు మంచివాళ్లు అయితే ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పారు. కానీ ఇప్పుడ రాష్ట్రంలో అదే జరగుతోంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కాక ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రభుత్వం పని అయిపోయింది. చంద్రబాబు బయటకు వచ్చి మీకోసం మళ్లీ కష్టపడతారు. దేవుడు దయతో, ప్రజల మద్ధతులో చంద్రబాబు వస్తారు..మళ్లీ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి. వారిది ధనబలం..మనది ప్రజాబలం. 2024లో వచ్చే కురక్షేత్ర సంగ్రామంలో టీడీపీ – జనసేన విజయం తథ్యం. వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును నిర్బంధించారు. ఆయన చాలా స్ట్రాంగ్ పర్సన్. చంద్రబాబు చాలా ధైర్యంగా ఉన్నారు. ప్రజల కోసం, టీడీపీ బిడ్డల గురించే చంద్రబాబు అడుగుతున్నారు.’’ అని భువనేశ్వరి అన్నారు.