తారకరత్న మృతిపై తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి సంచలన ఆరోపణలు చేశారు. తారకరత్న మృతి చాలా బాధాకరమైన విషయం అని అంటూనే తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు చేశారు. చంద్రబాబు తమ కుటుంబంపై నీచమైన రాజకీయ విధానం అవలంభించారని ఆరోపించారు. లోకేష్ పాదయాత్రకు, లోకేష్ కు చెడ్డ పేరు వస్తుందని తారకరత్న మరణవార్తను ఇన్నాళ్లు చంద్రబాబు దాచారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాణాలు కోల్పోయిన తారకరత్నను తమ స్వార్ధ రాజకీయ కోసం ఇన్నాళ్లు ఆసుపత్రిలో ఉంచారని అన్నారు. రెండు రోజులు పాదయాత్ర వాయిదా వేసినప్పడే మరణ వార్త అప్పుడే ప్రకటించి ఉండాల్సిందని అన్నారు. ప్రజలు అపశకునంగా భావిస్తారని ఇన్నాళ్లు డ్రామా చేశారని అన్నారు. రాష్ట్రానికే నాన్న కొడుకులు అపశకునం అని ప్రజలకు తెలుసని వ్యాఖ్యలు చేశారు.
‘‘గుండె ఆగిపోయిన నాడే డాక్టర్లు చెప్పారు. తారకరత్న బ్రతకడం చాల కష్టమని.. తారకరత్న భార్య బిడ్డలను, తల్లి తండ్రులను చంద్రబాబు మానసిక క్షోభకు గురి చేశారు. నీచమైన రాజకీయాలు నారా కుటుంబం చేయడం ఆపేస్తే, మా నందమూరి కుటుంబం బాగుపడుతుంది’’ అని తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి అన్నారు.
చంద్రబాబు దంపతుల పరామర్శ
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శంకర్ పల్లి సమీపంలోని నందమూరి తారకరత్న ఇంటికి వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళి అర్పించారు. ఆయన వెంట సతీమణి భువనేశ్వరి కూడా ఉన్నారు. తర్వాత తారకరత్న చిత్ర పటానికి పూలు సమర్పించి, నమస్కరించారు. తారకరత్న భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులను చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు పరామర్శించారు.
ఆ తర్వాత అక్కడే ఉన్న వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబును పలకరించారు. కాసేపు వారు పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకున్నారు. విజయసాయి రెడ్డి తరచూ చంద్రబాబు లక్ష్యంగా పరుష పదజాలంతో ట్విటర్ వేదికగా ట్వీట్లు చేసే సంగతి సంగతి తెలిసిందే.
అనంతరం విజయసాయి రెడ్డితో కలిసి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఒక మంచి భవిష్యత్ ఉన్న వ్యక్తిని కోల్పోయామని చంద్రబాబు ఆవేదన చెందారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన ఉందని కూడా తనతో చెప్పారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఆ అవకాశం కూడా ఇద్దామనుకున్నామని, దీనిపై సమయం వచ్చినపుడు మాట్లాడతానని తనతో చెప్పినట్లుగా గుర్తు చేసుకున్నారు. ఈ లోపే తారకరత్న చనిపోవడం బాధాకరమని అన్నారు.
‘‘ఈనెల 22వ తేదీకి తారకరత్నకు 40 సంవత్సరాలు నిండుతాయి. ఒక మంచి భవిష్యత్తు ఉన్న వ్యక్తిని కోల్పోయాం. సినిమా రంగంలో ఒకే రోజు 9 సినిమాలు ప్రారంభోత్సవం చేసిన రికార్డు ఆయనది. అమరావతి అనే సినిమాలో నటనకు నంది అవార్డు కూడా వచ్చింది. చిన్న వయసులో తారకరత్న చనిపోవడం బాధేస్తోంది. కుటుంబం, అభిమానులు ప్రార్థించినా ఫలితం లేకుండా పోయింది. చిన్న వయసులో ఏ ఆశయాల కోసం తారకరత్న పని చేశారో వాటిని ముందుకు తీసుకెళ్లేలా అభిమానులు పని చేయాలని అనుకుంటున్నా.
తారకరత్నకు ముగ్గురు పిల్లలు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన వారిని చూస్తే చాలా బాధగా ఉంది. భగవంతుడు వారికి ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా. మేం వారికి ఎప్పుడూ అండగానే ఉంటాం. తారకరత్న ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’ అని చంద్రబాబు నాయుడు విజయసాయిరెడ్డితో కలిసి ప్రెస్ మీట్‌లో మాట్లాడారు.
విజయసాయిరెడ్డి తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి తరపు బంధువు. తారకరత్న ఆస్పత్రిలో చేరిననాటి నుంచి విజయసాయిరెడ్డి కూడా ఆయన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. తారకరత్నను చేర్పించిన బెంగళూరులోని నారాయణ ఆస్పత్రికి వెళ్లి కూడా పరామర్శించి వచ్చారు.