Taraka Ratna Is No More: టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna) కన్నుమూశారు. సుమారు 23 రోజులుగా బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. అయితే బావ తారకరత్న ఇకలేరన్న విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జీర్ణించుకోలేకపోతున్నారు. నందమూరి ఫ్యామిలీతో పాటు నారా వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కోలుకుని మళ్లీ సినిమాల్లో తన నటనతో మెప్పిస్తారని, లేకపోతే రాజకీయాల్లో రాణిస్తారని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది.


నారా లోకేష్ ఏమన్నారంటే..
బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించ‌దు అన్నారు నారా లోకేష్. నేనున్నానంటూ నా వెంట న‌డిచిన ఆ అడుగులు చ‌ప్పుడు ఆగిపోయింది. నంద‌మూరి తార‌క‌ర‌త్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. తెలుగుదేశం యువ‌తేజం తార‌క‌ర‌త్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీర‌ని లోటు అన్నారు. నిష్కల్మషమైన నీ ప్రేమ‌, స్నేహ బంధం మ‌న బంధుత్వం కంటే గొప్పది. తార‌క‌ర‌త్నకి క‌న్నీటి నివాళులు అని తారకరత్న మరణం పట్ల టిడిపి జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్‌ స్పందించారు.


తీవ్ర దిగ్భ్రాంతి, బాధ కలిగించింది: చంద్రబాబు
నందమూరి తారకరత్న మరణవార్త తీవ్రమైన దిగ్భ్రాంతిని, బాధను కలిగించిందన్నారు చంద్రబాబు. తారకరత్నను బతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబ సభ్యుల, అభిమానుల ప్రార్థనలు, అత్యంత నిపుణులైన డాక్టర్ల వైద్యం ఫలితాన్ని ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.






23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న.. చివరికి మాకు దూరం అయ్యి మా కుటుంబానికి విషాదం మిగిల్చాడు. తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.


విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, స్వర్గీయ ఎన్టీఆర్ మనవడు, నందమూరి మోహనకృష్ణ తనయుడు.. సినీ నటుడు నందమూరి తారకరత్న తీవ్రమైన గుండెపోటుతో బెంగళూరు లోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. టీడీపీ యువతేజం తారకరత్న అకాల మృతికి తెలుగుదేశం పార్టీ నివాళులు అర్పించింది.


లోకేష్ యువగళం పాద‌యాత్రకి బ్రేక్...
నంద‌మూరి తార‌క‌ర‌త్న మృతితో టిడిపి యువ‌నేత నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్రకి బ్రేక్ ఇచ్చారు. తార‌క‌ర‌త్నకి నివాళులు అర్పించేందుకు లోకేష్ ఆదివారం హైద‌రాబాద్ రానున్నారు. దాంతో తన పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు లోకేష్.


గత నెలలో గుండెపోటు
నారా లోకేష్ చేపట్టిన 'యువ గళం' పాదయాత్రలో పాల్గొనడానికి జనవరి 27న తారకరత్న కుప్పం వెళ్ళారు. అక్కడ లక్ష్మీపురంలో గల మసీదులో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో లోకేష్‌, బాలకృష్ణతో పాటూ ఆయన పాల్గొన్నారు. మసీదు నుంచి త్వరగా బయటకు వచ్చిన తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. చుట్టుపక్కల తెలుగు దేశం పార్టీ శ్రేణులు వెంటనే కుప్పంలో కేసీ ఆస్పత్రికి తీసుకు వెళ్ళారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం పీఈఎస్‌ మెడికల్‌ కాలేజీకి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం అదే రోజు అర్ధరాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తీసుకువెళ్ళారు.