భారత్‌తో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పోరాడదగ్గ స్కోరు సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బ్రిటిష్ బృందం 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నటాలీ స్కీవర్ (50: 42 బంతుల్లో, ఐదు ఫోర్లు) అర్థ సెంచరీ సాధించింది. రేణుకా సింగ్ 15 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీయడం విశేషం.


టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే మొదటి ఓవర్ లోనే ఇంగ్లండ్‌కు పెద్ద దెబ్బ తగిలింది. ఓపెనర్ డేనియల్లీ వ్యాట్ (0: 1 బంతి) తను ఆడిన మొదటి బంతికే అవుట్ అయింది. మరో ఓపెనర్ సోఫియా డంక్లే (10: 11 బంతుల్లో, ఒక ఫోర్), వన్ డౌన్ బ్యాటర్ ఆలిస్ క్యాప్సే (3: 6 బంతుల్లో) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. దీంతో ఇంగ్లండ్ 29 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లే ముగిసే లోపే టాప్ ఆర్డర్ మొత్తం పెవిలియన్ బాట పట్టింది.


అయితే అసలు ఆట ఆ తర్వాతనే మొదలైంది. టూ డౌన్‌లో వచ్చిన నటాలీ స్కీవర్ (50: 42 బంతుల్లో, ఐదు ఫోర్లు), ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్ (28: 23 బంతుల్లో, నాలుగు ఫోర్లు) ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. ఈ జోడి నాలుగో వికెట్‌కు 38 బంతుల్లోనే 51 పరుగులు జోడించింది. అయితే ఈ దశలో హీథర్ నైట్ అవుటైనా, తన తర్వాత వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ అమీ జోన్స్ (40: 27 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) వేగంగా ఆడింది. దీంతో ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. భారత్ విజయానికి 120 బంతుల్లో 151 పరుగులు అవసరం. భారత్ తరఫున ఏకంగా ఏడుగురు బౌలింగ్ చేశారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్ ఐదు వికెట్లు తీసుకోగా, శిఖా పాండే, దీప్తి శర్మలకు చెరో వికెట్ దక్కించుకున్నారు.


ఇంగ్లండ్ మహిళలు (ప్లేయింగ్ XI)
సోఫియా డంక్లీ, డేనియల్ వ్యాట్, అలిస్ క్యాప్సే, నాట్ స్కివర్ బ్రంట్, హీథర్ నైట్(కెప్టెన్), అమీ జోన్స్(వికెట్ కీపర్), కేథరీన్ స్కివర్ బ్రంట్, సోఫీ ఎక్లెస్టోన్, షార్లెట్ డీన్, సారా గ్లెన్, లారెన్ బెల్


భారత మహిళలు (ప్లేయింగ్ XI)
షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), శిఖా పాండే, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా ఠాకూర్ సింగ్