తిరుమలకు వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం హెచ్చరిక జారీ చేసింది. మళ్లీ చిరుత పులి, ఎలుగు బంటి ముప్పు పొంచి ఉందని తెలిపింది. కాబట్టి తిరుమలకు అలిపిరి నడక మార్గంలో వెళ్లే భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. నడక మార్గం చుట్టుపక్కల పులి లేదా ఇతర క్రూర జంతువుల సంచారం ఉందేమో తెలుసుకొనేందుకు టీటీడీ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో తాజాగా దృశ్యాలు నమోదయ్యాయి. ఓ పులి, మరో ఎలుగుబంటి తిరుగుతున్న ఫోటోలు ఆ ట్రాప్ కెమెరాల్లో నమోదు అయ్యాయి.


కొద్ది నెలల క్రితం ఓ బాలుడు, మరో బాలికపై పులి జరిపిన దాడి ఘటనల నేపథ్యంలో టీటీడీ జాగ్రత్తలు చేపట్టిన సంగతి తెలిసిందే. భక్తులు కూడా అలిపిరి నడక మార్గంలో తగ్గిపోవడంతో భయం పోగొట్టేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. భక్తులకు చేతి కర్రలు ఇవ్వడం ప్రారంభించారు. కొన్నాళ్లుగా నడక మార్గంలో పులి సంచారం లేకపోవడంతో ఆ భయం కాస్త తగ్గింది. తాజాగా పులి, ఎలుగుబంటి తిరుగుతున్న దృశ్యాలు కనిపించడంతో మరోసారి భక్తుల్ని టీటీడీ అప్రమత్తం చేసింది.


నడకదారి భక్తులకు విజ్ఞప్తి. తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో ఈనెల 24 నుంచి 27వ తేదీ మధ్యలో శ్రీ లక్ష్మీ నారాయణస్వామి ఆలయం నుంచి రిపీటర్ మధ్య ప్రాంతంలో ఒక చిరుత, ఒక ఎలుగుబంటి తిరుగుతున్నట్టుగా కెమెరా ట్రాప్ లో నమోదయింది. కావున నడకదారి భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. భక్తులు గుంపులు గుంపులుగానే వెళ్లాలని విజ్ఞప్తి చేయడమైనది’’ అని తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటన విడుదల చేసింది.