Tirumala Land Slide: తిరుపతి : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తిరుమలలో మరోసారి కొండ చరియలు విరిగిపడ్డాయి. రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడటంతో మొదటి ఘాట్ రోడ్డులోనే భక్తులను టీటీడీ అనుమతిస్తుంది. దీంతో అలిపిరి వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి పోవడంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. భక్తులు దర్శనాలను వాయిదా వేసుకోవాలని, టిక్కెట్లు ఉన్న వారిని కొన్ని నెలలవరకు దర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ పేర్కొంది.
తిరుమల రెండోవ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడడంతో ఘాట్ రోడ్డులో భక్తులను టీటీడీ తాత్కాలికంగా నిలిపివేసింది. నేటి వేకువజామున రెండోవ ఘాట్ లోని లింక్ రోడ్డు సమీపంలో సుమారుగా నాలుగు ప్రదేశాల్లో కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో ముందుగానే వాహనాలు ముందస్తుగానే నిలిచి పోవడంతో పెనుప్రమాదం తప్పింది. పెద్ద బండరాయి పడటంతో ఓ బస్సు డ్రైవర్ అప్రమత్తమై బ్రేక్ వేశారు. దాంతో పెను ప్రమాదం తప్పింది.
ఘాట్ రోడ్డులో నిలిచి పోయిన వాహనాలను లింక్ రోడ్డు గుండా తిరుమలకు అనుమతించారు. మొదటి ఘాట్ రోడ్డు నుండే తిరుమలకు వాహనాలను అనుమతి ఇస్తున్నారు. అయితే తిరుపతి నుండి తిరుమలకు వెళ్లే వాహనాలు ఒక గంట, తిరుమల నుండి తిరుపతికి వచ్చే వాహనాలకు మరో గంట పాటు అనుమతిస్తూ ఒకే ఘాట్ రోడ్డులో వాహనాలను అధికారులు అనుమతిస్తున్నారు. విరిగిపడ్డ కొండ చరియలను తొలగించే మరమ్మతు పనులను టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు కొనసాగిస్తున్నారు.
వర్షాలు కురిసే సమయంలో తరచూ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడే అవకాశం ఉండడంతో ఢిల్లీ నుండి ఐటీ నిపుణులను రప్పించి కొండచరియలు విరిగి పడే ప్రాంతాలను పరిశీలించి ఓ నివేదిక ఇవ్వాలని అధికారులను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు. ఈ క్రమంలో ఐటీ నిపుణులు ఇవాళ సాయంత్రం తిరుమలకు చేరుకోనున్నారు. కొండచరియలు పడే ప్రాంతాలను పరిశీలించి, కొండ చరియలు విరిగి పడకుండా చర్యలు చేపట్టనున్నారు. ఘాట్ రోడ్డులో మరమ్మత్తు పనులు కొనసాగుతున్న క్రమంలో భక్తులను పరిమిత సంఖ్యలో దర్శనానికి అనుమతిస్తున్నారు.
Also Read: Tirumala: శ్రీవారి సర్వ దర్శనం టిక్కెట్లు విడుదల.. రోజుకు పది వేల చొప్పున కేటాయించిన టీటీడీ
మరమ్మతులకు కొన్ని రోజులు పట్టే అవకాశం ఉండటంతో దర్శన టిక్కెట్లు ఉన్న భక్తులు తేదీలను మార్చుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఆన్‌లైన్‌లో దర్శన టిక్కెట్లు పొందిన భక్తులకు మరో ఆరు నెలల వరకూ దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. రెండో ఘాట్ రోడ్డును మరమ్మత్తు చేసి భక్తులను అనుమతించేందుకు మరో నాలుగు రోజుల సమయం పట్టే పరిస్ధితి కనిపిస్తుందని అధికారులు చెబుతున్నారు.
Also Read: Dollar Seshadri: ఆప్తుడి చెంతకు శేషాద్రి డాలర్.. భావోద్వేగంతో మెడలో వేసుకున్న టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి