Janasena Leader Vinutha Kota: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, ఇటీవల ప్రతి కార్యక్రమంలోనూ ఆయన మూడు పెళ్లిళ్లపై సీఎం జగన్ వ్యాఖ్యలు చేయడం జనసైనికులను ఆగ్రహానికి గురి చేస్తోంది. పవన్ సైతం సహనం కోల్పోయి మాట్లాడుతూనే సీఎం జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. జనసేనానికి తోడు పార్టీ నేతలు సైతం సీఎం జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. జనసేన మహిళా నాయకురాలు వినుత కోటా మరో అడుగు ముందుకేసి.. బెంగళూరు ప్యాలెస్ లో సీఎం జగన్ రాసలీలల ఆధారాలు బయట పెడుతాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీ సీఎం జగన్ పై శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇంఛార్జి వినుత కోటా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. శ్రీకాళహస్తిలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం
జగన్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బెంగుళూరు ప్యాలెస్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు సాగిస్తున్న రాసలీలలను ఆధారాలతో సహా బయటపెడతామని సంచలన వ్యాఖ్యలు చేయడం ఏపీలో దుమారం రేపుతున్నాయి. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ప్రజా విధానాలపై కాకుండా జనసేనాని పవన్ వ్యక్తిగత విషయాలపై మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. పవన్ పై విమర్శలు చేయడం మానుకొని, ప్రజా సంక్షేమం కోసం ప్రయత్నించాలని హితవు పలికారు. వెంకటగిరిలో నేతన్న నేస్తం సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రజా విధానాలపై కాకుండా పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చెయ్యడాన్ని తీవ్రంగా ఖండించారు. 
పవన్ కల్యాణ్ వాలంటీర్ వ్యవస్థ ద్వారా వైసీపీ పార్టీ సేకరిస్తున్న సమాచారం ఎక్కడికి వెళుతోందని, డేటా ఎక్కడ స్టోర్ చేస్తున్నారుఈ వ్యవస్థకి అధిపతి ఎవరు ఎవరిని, వారు తప్పు చేస్తే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు. వాలంటీర్ల ద్వారా ప్రజలకి సంబంధించిన సెన్సిటివ్ డేటా కొంత మంది నేరగాళ్లకు వెళుతుందేమోనని అనుమానాలు వ్యక్తం చేస్తూ వాలంటీర్ల వ్యవస్థపై ప్రశ్నల వర్షం గుప్పించారు. రాష్ట్రంలో మహిళలకి ఇబ్బంది కలుగుతుందని మాట్లాడితే సీఎం జగన్, మంత్రులు సమాధానం చెప్పలేక పవన్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడి ఎదురు దాడి చేయడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. జగన్ ప్రభుత్వం అంత పారదర్శకంగా వాలంటీర్ వ్యవస్థను నడుపుతుంటే అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాలే కానీ, ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడటం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగదన్నారు. 
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, మీ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించినప్పుడు జగన్ రెడ్డి కలకత్తాలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అదే రోజు ఎవరితో మీటింగ్లో ఉన్నారో మాకు తెలుసని.. ఆధారాలతో సహా బయట పెడుతామన్నారు. బెంగళూరు ప్యాలస్ లో జగన్, ఆయన మంత్రులు జరిపే రాసలీలలు గురించి కూడా జనసేన పార్టీ వద్ద ఆధారాలున్నాయని అన్నారు.. అవి బయటకు రాకుండా ఓ కర్ణాటక మంత్రికి రూ.200 కోట్లు ముడుపులు ఇచ్చారనీ ఆరోపించారు.. వీటన్నిటిని ఆధారాలతో సహా బయట పెడతామని స్పష్టం చేశారు. జగన్ రెడ్డి విధాన పరంగా మాట్లాడకుండా, ఓటమి భయంతో చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు.. ముఖ్యమంత్రి అంటే అందరికీ ఆదర్శంగా ఉండాలే కానీ, ఈ స్థాయి దిగజారుడు మాటలు మాట్లాడం సహేతుకం కాదన్నారు. 
జగన్ రెడ్డి వ్యక్తిగత జీవితం గురించి కూడా జనసేన పార్టీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయనీ, కానీ మా సంస్కారం వాటిని బయట పెట్టకుండా అడ్డుపడుతుందని తెలిపారు.. కొందరు వాలంటీర్లు మహిళలను చెరబట్టిన ఉదంతాలు రాష్ట్రంలో కోకొల్లలుగా బయటకు వస్తున్నా సీఎం పట్టించుకోవడం లేదన్నారు. ఆ వ్యవస్థను ప్రశ్నించిన పవన్ పై మాత్రం వ్యక్తిగతంగా మాట్లాడుతూ ప్యాకేజీ స్టార్, మూడు పెళ్లిళ్లు, దత్త పుత్రుడు అంటూ వ్యాఖ్యానించడం హేయమన్నారు.  వాలంటీర్ల ద్వారా ప్రజలకి ఎంత నష్టం జరుగుతుందో తెలపడంతో వీళ్ళ గుట్టు రట్టయిందని జీర్ణించుకోలేక ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తెలిపారు. మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు కొనసాగిస్తే ధీటుగా మీ చీకటి పనులు బయట పెడతానని హెచ్చరించారు.