ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు జనసేనాని పవన్ కల్యాణ్. తనను దత్తపుత్రుడు అని సంబోధిస్తున్న జగన్ మోహన్‌ను ఇవాల్టి నుంచి తాను ఆంధ్రప్రదేశ్ థానోస్ అంటూ నామకరణం చేశారు. మార్వెల్‌లోని క్యారెక్టర్‌తో పోల్చారు పవన్. వైసీపీ థానోస్ నవరత్నాలు అంటూ అందర్నీ చంపేస్తున్నారని ఆరోపించారు.
తిరుపతి జనవాణిలో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాయలసీమ చదువుల సీమని కానీ దీన్ని ఫ్యాక్షన్ సీమగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నో గ్రంథాలయాలకు నెలవు రాయలసీమని తెలియజేశారు. అలాంటి గడ్డపై మాట్లాడటం చాలా ఆనందంగా ఉందన్నారు పవన్ కల్యాణ్.
వైసీపీ నేతలు డబ్బు ఉందని అహంకారంతో విర్రవీగితే మడిచి ఎక్కడైనా పెట్టుకోండని ఘాటుగా కామెంట్ చేశారు. ఓ సామజిక వర్గాన్ని గంపగుత్తగా అమ్మేస్తున్నామని విమర్శిస్తున్నారని... తాను ఎవరికీ కొమ్ముకాయడం లేదన్నారు పవన్. రాష్ట్రం, దేశంలో మూడో ప్రత్యామ్నాయం చాలా అవసరం ఉందన్నారు. వైసీపీ కోవర్ట్‌ల వల్లే అప్పట్లో పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయాల్సి వచ్చిందన్నారు పవన్ కల్యాణ్. ఆనాడు చిరంజీవిపై ఒత్తిడి తీసుకొచ్చి పార్టీ విలీనం చేయించారని ఆరోపించారు.
తాను మాత్రం ప్రజల తరఫున గట్టిగా నిలబడేందుకే వచ్చానన్నారు పవన్. రాజకీయంలో మార్పు వచ్చే వరకూ ఉంటానన్నారు. రాజకీయంలో మార్పు వస్తే పోతానన్నారు. పీఆర్పీ విలీనం సమయంలో తనకు ఎన్నో బెదిరింపులు వచ్చాయి పార్టీలో చేరమని కూడా ఒత్తిడి తీసుకొచ్చారన్నారు. తాను రాజకీయాల్లోకి కొత్త కావచ్చు కానీ... మనుషుల మనస్తత్వాలకు కొత్తకానన్నారు పవన్.
బిజెపితో పొత్తు వల్లే 2014 ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్ చేశామని తెలియజేశారు పవన్ కల్యాణ్. పిలువు ఇవ్వడం కాదు, తమ ఆతిథ్యం తీసుకోమని చంద్రబాబుతో చెప్పానని వివరించారు. కంస్ట్రక్టివ్ పాలిటిక్స్ అంటే తనకు ఇష్టమని.. డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయబోనన్నారు పవన్. కుప్పంలో జనసేనను ఇబ్బంది పెడుతుంటే అక్కడ ప్రతిపక్షాలను కలుపుకొని వెళ్ళామని గుర్తు చేశారు.
ఎంత పెద్ద స్టేటస్ వ్యక్తి అయినా ఇంటి ముందు నడుచుకుంటూ వచ్చే సంప్రదాయం వైసీపీ తీసుకొచ్చిందని ఎద్దేవా చేశారు. ఇంకోసారి వైసీపీ అధికారంలోకి వస్తే జపాన్‌లో మద్యం పోటీలు పెట్టినట్లు పెడుతారన్నారు. వైసీపీని ఓడించడమే తమ ప్రథమ అజెండా అని గుర్తు చేశారు పవన్ కల్యాణ్. పార్టీలోకి రావాలంటే ముందుగా జనసేన కార్యకర్తలను గౌరవించాలని నేతలకు సూచించారు.