Tirumala News: గోవింద అంటే పాపాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడు.. సప్తగిరుల్లో వెలసిన గోవిందుడి... ఇలా శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని భక్తులు అనేక నామాలతో కొలుస్తారు. సప్తగిరిల పై వెలసిన వెంకటాచల క్షేత్రానికి క్షేత్రపాలకుడు మాత్రం రుద్రుడు(శివుడు). నేటికి నిత్య నివేదనలు, పూజలు అందుకుంటున్నారు. మహాశివరాత్రి సందర్భంగా తిరుమల క్షేత్ర పాలకుడైన శివుడి గురించి మీరు తెలుసుకోండి..!
తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభ మండపం ఆవరణలో బలిపీఠానికి ఈశాన్యమూలన బలిపీఠం వంటి ఆకారంలో 1 1/2 అడుగుల చిన్న శిలపీఠం ఉంటుంది. దీనిని క్షేత్రపాలక శిల అంటారు. పూర్వం ఈ శిల రుద్రుని పూర్ణాంశతో ప్రకాశిస్తూ తిరుమల గుడి చుట్టూ తిరుగుతూ కాపలకాస్తూ ఉండేది. ప్రతి రోజూ రాత్రి అర్చకులు ఇంటికి వెళ్ళేటప్పుడు గుడి తాళాలు ఈ శిల పై పెట్టి నమస్కారం చేసి వెళ్ళేవారు.. మళ్లీ తెల్లవారుజామున వచ్చి నమస్కారం చేసి తాళాలు తీసుకునేవారు. ఇలా కొనసాగుతుండగా రాత్రి ఆలయం చుట్టూ తిరిగే క్రమంలో బాలుడు శిల కింద పడి మరణించాడని, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శిల ను గోగర్భం తీర్థం (పాండవ తీర్థం) వద్ద కు తరలించారని, అందులోని చిన్న భాగం నేటికి తిరుమల బలిపీఠానికి దగ్గరలో క్షేత్రపాలక శిల అని అనేక పుస్తకాల్లో ప్రచురించారు.
నేటికి కొనసాగుతున్న ఆనవాయితీ
తిరుమలలో ప్రతి రోజూ రాత్రి గుడి మూసిన తరువాత ఆలయం లోని క్షేత్రపాలక శిల కు గుడి తాళాలు తాకించి నమస్కారం చేసి వెళ్తారు.. తిరిగి వచ్చిన తరువాత కూడా శిలకు తాళాలు తాకించి నమస్కారం చేసి ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఇది ప్రతి రోజూ జరిగే ఆనవాయితీ.
కపిలేశ్వరస్వామి వారే క్షేత్రపాలకుడు
తిరుమల క్షేత్రానికి క్షేత్రపాలకుడైన రుద్రుడు వేంకటాచల క్షేత్ర మూలంలో శ్రీ కపిలేశ్వరమహాలింగం రూపంలో ఆవిర్భవించింది. అదే శేషాచలం కొండలు దిగువున నిత్యం జాలువారే జలపాతం తో కొలువైన కపిలతీర్థం. యుగ యుగాల్లో తనను సేవించే వారికి అనుగ్రహిస్తున్నాడు.
మహాశివరాత్రికి అభిషేకంప్రతి ఏడాది మహాశివరాత్రి సందర్భంగా పాండవ తీర్థం లోని క్షేత్రపాలక శిలపై కొలువైన ఉన్న పరమేశ్వరుడికి అభిషేకం చేస్తారు. ప్రకృతి సోయగాల నడుమ... ఆహ్లాదకర వాతావరణంలో నీటి ప్రవాహాలతో... సాధువుల యోగ ముద్రలో... నిశబ్థ ప్రాంతంలో రుద్రుడు దర్శనం చేసుకోవచ్చు. మహాశివరాత్రి పర్వదినం రోజున స్వామివారి ఆలయం నుండి అర్చకులు, ఆలయ అధికారులు, యాత్రికులకు మంగళవాయిద్యాలతో పాండవతీర్థానికి చేరుకుంటారు. అక్కడ ఏకాదశ రుద్రం తో ఉన్న కేత్రపాలకుడు అయిన రుద్రుడి కి అభిషేకం నిర్వహిస్తారు.
అనంతరం ఆ గుండునకు వెండినామాలు (ఊర్ద్వవుండ్రాలు) కండ్లు అతికించి పుష్పాలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. రుద్రునకు ఆరగింపు అయిన వడపప్పు, పండ్లు, తాంబూలంను భక్తులకు పంపిణీ చేస్తారు. ఈ సారి తిరుమల యాత్రలో తిరుమల క్షేత్రపాలకుడిని మీరు తప్పక దర్శించండి. ప్రతి సోమవారం, ప్రత్యేక రోజుల్లో సైతం రుద్రుడి కి స్థానికులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తుంటారు.