పరీక్ష పేపర్ లీకేజీలో అరెస్టైన మాజీ మంత్రి నారాయణకు బెయిల్ మంజూరైంది. పోలీసుల అభియోగాన్ని న్యాయమూర్తి తోసిపుచ్చారు. 2014లో నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్‌ పదవికి ఆయన రాజీనామా చేసినట్టు ఆధారాలు చూపించారు. దీంతో వ్యక్తిగత పూచీకత్తుతోపాటు లక్ష రూపాయల చొప్పున ఇద్దరు వ్యక్తులు జామీను ఇవ్వలన్న మెజిస్ట్రేట్‌ సులోచనారాణి.


పదోవ తరగతి పరీక్ష పత్రాల‌ లీకేజీ వ్యవహారంలో మాజీ‌మంత్రి నారాయణను అరెస్టు చేసిన పోలీసులు నిన్న చిత్తూరుకు తరలించారు.. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు భారీగా టిడిపి నేతలు చేరుకున్నారు. చిత్తూరు డి.టి.సి, ఎస్పీ కార్యాలయానికి భారీగా టిడిపి నాయకులు చేరుకున్నారు. టిడిపి ఎమ్మెల్సీ దొరబాబుతోపాటుగా, జిల్లా ముఖ్య నేతలు భారీగా ఎస్పీ కార్యాలయం వద్దకు గుమిగూడారు. దీంతోో భారీగా పోలీసులు మోహరించారు. పటిష్టమైన భద్రత మధ్య మాజీ మంత్రి నారాయణకు వైద్యులు పరీక్షలు నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నారాయణను మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు.


బెయిల్ మంజూరైన తర్వాత మాజీ మంత్రి తరఫున వాదించిన లాయర్ మాట్లాడుతూ... నారాయణ విద్యాసంస్థల అధినేతగా ఉన్నారని ఆయనపై పోలీసులు అభియోగాలు మోపారని.. కానీ 2014లోనే తప్పుకున్నట్టు చెప్పారు. విద్యాసంస్థలతో తనకు సంబంధం లేదన్న డాక్యుమెంట్లు న్యాయమూర్తికి సమర్పించినట్టు చెప్పారు. పోలీసులు చెప్పినట్టు నేరారోపణ నమ్మేలా లేదని జడ్జి అభిప్రాయపడ్డట్టు తెలిపారు.


పదోతరగతికి సంబంధించిన తెలుగు ప్రశ్నాపత్రం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లిలోని పాఠశాల నుంచి బయటకు వచ్చిందని.... ఇందులో నారాయణ సూత్రధారిగా పోలీసులు అభియోగాలు మోపారు. ఆయన్ని నిన్న మధ్యాహ్నం అరెస్టు చేసినట్టు ప్రకటించారు. హైదరాబాద్‌ నుంచి చిత్తూరు తరలించారు. ఈ టైంలో చాలా నాటకీయ పరిణామాలు జరిగాయి.