Heavy Rush in Tirumala: ఓవైపు వేసవి సెలవులు, అందులోనూ వీకెండ్స్ కావడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. దాంతో తిరుమలలో భక్తులతో కంపార్ట్‌మెంట్స్ నిండిపోయాయి. దాంతో బయట సైతం క్యూ లైన్స్ ఏర్పాటు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీవారి దర్శనానికి దాదాపు 25గంటలు పట్టే అవకాశం ఉంది స్వయంగా టీటీడీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందో శ్రీవారి భక్తులు అర్థం చేసుకోవచ్చు. కరోనా వ్యాప్తి తరువాత.. దాదాపు రెండేళ్ల అనంతరం ఇటీవల తరచుగా తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. కొన్ని సందర్భాలలో శ్రీవారి దర్శనానికి ఒకరోజు నుంచి రెండు రోజుల సమయం పడుతోంది. టీటీడీ ఎన్ని ఏర్పాట్లు చేసినా, భక్తుల అనూహ్య రద్దీతో స్వామి వారి దర్శనానికి గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.
తిరుమలలో శనివారం నాడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి దర్శనార్థం భక్తులు రాంభగీచా అతిథి గృహాలు వరకు క్యూ లైన్లో వేచి ఉన్నారు. ప్రస్తుతం తిరుమలకు వచ్చే భక్తులకు స్వామివారి దర్శనానికి కనీసం ఒకరోజు సమయం పడుతోంది. కాగా, నిన్న శ్రీవారిని 67,949 మంది భక్తులు దర్శించుకున్నారు. 39,837 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తుల కానుకలు, విరాళాల రూపంలో నిన్ని ఒక్కరోజు శ్రీవారి హుండీకి రూ.3.70 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.