Jagan Comments : చంద్రబాబు నాయుడు (Chandrababu ) అవినీతి ఆరోపణలతోనే అరెస్ట్ అయ్యారని... అందుకు పూర్తి ఆధారాలు ఉన్నాయని సీఎం (Cm)జగన్ ( Jagan) అన్నారు. కోర్టు ఆయనను జైలుకు పంపిందని, మరి అలాంటప్పుడు ఎవరైనా అది ప్రతీకార రాజకీయం అని ఎలా అంటారని ప్రశ్నించారు. తిరుపతి (Tirupati)లో జరుగుతున్న ఓ సదస్సులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఎవరైనా ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయలేరని. ఏం చేసినా కోర్టుల్లో లిట్మస్ టెస్ట్ ఉంటుందన్నారు. ఆధారాలు లేకపోతే, ఆరోపణల్లో వాస్తవాలు లేకపోతే, కేసులు కోర్టుల్లో నిలబడవని అన్నారు. ఆధారాలు ఉన్నాయని కోర్టులు కన్విన్స్ అయితే తప్ప, నిర్ణయాలు తీసుకోవన్నారు. చంద్రబాబుది హైప్రొఫైల్ కేసని... త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఏ సీఎం కూడా అలాంటి చర్యలకు దిగరని అన్నారు. కచ్చితమైన ఆధారాలు ఉంటే తప్పా...అరెస్టులు జరగవన్నారు.
రెండు జాతీయ పార్టీలు నామమాత్రమే
రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీలు నామమాత్రమేనన్నారు సీఎం జగన్. కాంగ్రెస్, బీజేపీకి ఇక్కడ బలం లేదని, కాబట్టి సహజంగానే ఇక్కడ వైఎస్సార్‌సీపీకి, తెలుగుదేశం, జనసేన కూటమితో పాటు, వారికి మద్దతు ఇచ్చే వారితోనే పోటీ ఉంటుందన్నారు. ఎన్నికల సమయంలో ప్రతి పార్టీ స్వయంగా సర్వే నిర్వహిస్తుందని, దాని ప్రకారం వ్యూహరచన చేసుకుంటుందన్నారు సీఎం జగన్. ప్రజలకు చాలా మేలు చేశామని, అందుకే తమ ప్రభుత్వంపై ప్రజలకు చాలా నమ్మకం ఉందన్నారు. స్థానికంగా కొందరు నాయకుల తీరు, వారు ప్రజలతో మమేకం కాకపోవడంతో వారిపై వ్యతిరేకత వచ్చిందన్నారు. అనేక అంశాల ఆధారంగా కొన్ని మార్పులు చేశామన్నారు. ఎన్నికలు మరో 70, 80 రోజుల్లో వస్తాయన్న జగన్...ఆఖరి క్షణంలో ప్రయోగాలు చేసే బదులు.. ముందుగా చేస్తే క్లారిటీ ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.
99 శాతం హామీలు అమలు
వాస్తవం కంటే విశ్వాసం అనేది ఎప్పటికైనా బలమైందని, అదే అందరూ చెబుతారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తాను ఎన్నికల ముందు ఏయే హామీలు ఇచ్చాను ? ఏమేం చేశాను ? అన్నదే ముఖ్యమన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిలో 99 శాతం అమలు చేశామన్నారు. వాటిని అమలు చేయడమే కాకుండా, ఆ మేనిఫెస్టోను ప్రజలకు చూపి, వారి విశ్వాసం పొందుతున్నామని వెల్లడించారు. ఆ విధంగా తమ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచుకుందన్నారు. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశామన్న సీఎం జగన్... ప్రతి 2 వేల జనాభాకు గ్రామ సచివాలయం ఏర్పాటు చేశామన్నారు. ప్రతి 60 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకం అందజేస్తున్నామని స్పష్టం చేశారు. ఎక్కడా వివక్ష చూపడం లేదని...అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి ఒక్కటీ డీబీటీ ద్వారానే జరుగుతోందన్నారు.
రూ. 2.53 లక్షల కోట్లు డీబీటీ ద్వారా పంపిణీ
నిజం చెప్పాలంటే విద్య, వైద్య రంగాల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయన్నారు జగన్, ప్రభుత్వ పనితీరు మారిందని, మహిళ సాధికారతలో మార్పు వచ్చిందని గుర్తు చేశారు. ఎక్కడా వివక్ష, అవినీతికి తావు లేకుండా నేరుగా పథకాల అమలు. లబ్ధిదారులకు నగదు బదిలీ డీబీటీ ద్వారానే జరుగుతున్నాయని అన్నారు. ఇవన్నీ తమ ప్రభుత్వాన్ని నిలబెడుతాయనే నమ్మకం తనకు ఉందన్నారు. ఏ పార్టీ కూడా హామీలు అమలు చేయలేదని, అవినీతి చేశామని చూపలేదని సవాల్ విసిరారు సీఎం జగన్. 56 నెలల్లో వివిధ పథకాల ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లో పూర్తి పారదర్శకంగా రూ. 2.53 లక్షల కోట్లు డీబీటీ విధానంలో జమ చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వంతో పోల్చి చూస్తే.. తక్కువ అప్పులు మాత్రమేనన్నారు. ఈ పరిస్థితుల్లో కేవలం సీఎం మాత్రమే మారారన్న జగన్... ఈ ప్రభుత్వం ఇన్ని చేయగలిగినప్పుడు, గత ప్రభుత్వం ఎందుకు చేయలేదన్నది ప్రజలు ఆలోచిస్తున్నారని అన్నారు.