YS Jagan Sensational Comments : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబాన్ని చీల్చి రాజకీయాలు చేస్తున్నారంటూ... కాంగ్రెస్ పార్టీ (Congress)పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి (Tirupati)లో జరుగుతున్న ఓ సదస్సులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy)మాట్లాడారు.  ఆంధ్రప్రదేశ్ (Ap)లో కాంగ్రెస్ పార్టీ నీచమైన రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. గతంలో తన బాబాయి వివేకానందరెడ్డిని మంత్రిని చేసి తనపై ప్రయోగించిందన్నారు. ఇప్పుడు మళ్లీ తన కుటుంబాన్ని విడదీసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. తన సోదరి షర్మిలను ఏపీ అధ్యక్షురాలిగా నియమించి...తనపై ప్రయోగిస్తోందన్నారు. ఇప్పటికిప్పుడే ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయినా తనకేం బాధ ఉందన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రాజకీయ లబ్ధికోసమే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని విడదీసిందన్న  ఆయన... విభజించి పాలించడమే ఆ పార్టీ విధానమని విమర్శించారు. గతం నుంచి హస్తం పార్టీ పాఠాలు నేర్చుకోలేదన్న సీఎం జగన్... ఆ పార్టీకి మరోసారి దేవుడు కచ్చితంగా గుణపాఠం చెబుతాడని అన్నారు. 


టీడీపీ, జనసేనలే మా ప్రత్యర్థి
ఆంధ్రప్రదేశ్ లో జాతీయ పార్టీలకు చోటే లేదన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి.. తెలుగుదేశం, జనసేన పార్టీలతోనే తమకు పోటీ అన్న ఆయన...సర్వే ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ప్రజా వ్యతిరేకత ఉన్న నేతలకు టికెట్లు ఇవ్వలేదని, రాష్ట్ర ప్రజలంతా తమ వైపే ఉన్నారని స్పష్టం చేశారు. రాష్ట్రం కోసమే కేంద్ర ప్రభుత్వం సఖ్యతగా ఉన్నామని జగన్ వెల్లడించారు. 


99%  హామీలన్నీ నెరవేర్చాం
తమ ప్రభుత్వానికి మంచి పేరు ఉన్నా కూడా...అక్కడ ఉండే స్ధానిక ఎమ్మెల్యేలకు చెడ్డపేరు రావడంతో అది పార్టీ పడుతోందన్నారు. ఈ కారణంగానే ఎమ్మెల్యేలను మార్చుతున్నట్లు జగన్ తెలిపారు. తాము తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తన వల్ల మేలు జరిగిందని భావిస్తే... ఓటు వేయాలని ధైర్యంగా అడుగుతున్నట్లు చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన 99%  హామీలన్నీ నెరవేర్చామన్న సీఎం జగన్, ప్రస్తుతం ప్రతి గ్రామానికి సచివాలయం ఉందన్నారు. ప్రతి గడపకు వాలంటరీ వ్యవస్థ ఉందని, ఇది చేశామని గర్వంగా చెప్పుకుంటానన్నారు. విద్య, వైద్యం, పరిపాలనా రంగాల్లో పెను మార్పులు తీసుకు వచ్చామని సీఎం జగన్ చెప్పారు. వివక్ష లేకుండా అవినీతిరహితంగా, పారదర్శకంగా అర్హత ఉన్న వారికి అన్నీ పథకాలు అందించామని స్పష్టం చేశారు.