Dharmavaram MLA kethireddy: ధర్మవరం పట్టణ రోడ్లు గుంతల మయంగా మారడంతో స్థానికంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని.. నాలుగున్నర ఏళ్లుగా పట్టణంలో రోడ్లపై గంపెడు మట్టి కూడా వేయలేదని మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ (Gonuguntla Suryanarayana) అన్నారు. ప్రతిరోజు గుంతల రోడ్లపై ప్రయాణిస్తున్న ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని... కొన్ని రోజులుగా ఈ విషయంపై ఆర్ అండ్ బి అధికారులను సంప్రదిస్తున్నా.. స్పందన లేదని ఆరోపించారు. ఆ రోడ్లను తక్షణమే రిపేరు చేయించకపోతే తానే స్వయంగా రంగంలోకి దిగి సొంత ఖర్చులతో వాటిని రిపేరు చేస్తామని ధర్మవరం (Dharmavaram) మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ రోడ్లు భవనాల శాఖ ఎస్ఈ  ఓబుల రెడ్డికి స్పష్టం చేశారు. బుధవారం ఆయన అనంతపురంలోని ఎస్ఈని కలిసి నివేదించారు. వారం రోజులు లోపు పనులు మొదలు పెట్టాలని అల్టిమేటం ఇచ్చారు. ధర్మవరంలో లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తాను అని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తా అన్నది త్వరలోనే ప్రకటిస్తానన్నారు.


అనంతరం ఆర్ అండ్ బి కార్యాలయ ఆవరణలో మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల మీడియాతో మాట్లాడారు. ధర్మవరం పట్టణంలో 1,50,000 మంది ప్రజలు నివసిస్తున్నారని.. పట్టణంలో ఏదో ఒకచోట రోడ్లపై ప్రయాణిస్తున్న ప్రజలు గాయాలపాలై ఆసుపత్రి పాలవుతున్నారని తెలిపారు. ఇదివరకే ధర్మవరం ఆర్ అండ్ బి అధికారులను కలిసి నివేదించినట్లు చెప్పారు. అయినప్పటికీ అక్కడి అధికారుల్లో చలనం కనిపించలేదన్నారు. వారం రోజుల్లో అధికారులు పనులు ప్రారంభించని పక్షంలో  తానే   రోడ్లపై పడ్డ గుంతలను   తారుతో రిపేర్లు చేసే పని మొదలు పెడతానని  గోనుగుంట్ల ప్రకటించారు. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు, కేంద్ర ప్రభుత్వం సహకారంతో ధర్మవరం నియోజకవర్గంలో 380 కిలోమీటర్ల మేర మట్టి రోడ్లను తారు రోడ్లుగా చేశారన్నారు.
ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే  కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అభివృద్ధి చేయడం లేదని, సమస్యలను పట్టించుకోవడం లేదని గోనుగుంట్ల ఆరోపించారు. కేతిరెడ్డి మాత్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాడని ఆరోపించారు. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి అక్రమంగా నాలుగువేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడని ధ్వజమెత్తారు. ధర్మవరం ప్రజలను  పీల్చి పిప్పిచేసి వేలకోట్లు సంపాదించాడని విమర్శించారు. పంచభూతాలను సైతం వదలకుండా దోపిడీకి తెగబడ్డాడని మండిపడ్డారు.
తాను చేస్తున్న కాంట్రాక్టు పనులకు ఎమ్మెల్యే  తీవ్రస్థాయిలో అడ్డంకులు సృష్టించారని అసహనం వ్యక్తం చేశారు. పనులు జరగకుండా వాహనాలను సీజ్ చేయించి, తప్పుడు కేసులు పెట్టించి  పాల్పడ్డాడన్నారు. తాను న్యాయపోరాటం చేసి పనులను తిరిగి ప్రారంభించానని తెలిపారు. ఎమ్మెల్యే కేతిరెడ్డికి అడ్డూ అదుపు లేకుండాపోయిందని. ధర్మవరం చెరువులోని 45 ఎకరాలను కబ్జా చేసి గుర్రాల కోట, అధునాతన భవంతులను నిర్మించాడన్నారు. ఆ ప్రాంతాన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చాడని దుయ్యబట్టారు. మరో 100 ఎకరాలు చెరువు స్థలాన్ని కొల్లగొట్టాలని చూశారన్నారు. నేషనల్ గ్రీనరీ ట్రిబ్యునల్ (ఎన్. జి. టి ) కి ఈ దందా వ్యవహారంపై గతంలోనే ఫిర్యాదు చేశామన్నారు. ఈ మేరకు ఎన్ జి టి విచారణ జరుపుతోందని, అధికారులు ఎవరైనా తప్పుడు నివేదిక ఇస్తే భవిష్యత్తులో వారు తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. నిజాలు నిగ్గుతేలితే వాళ్లు జైలు పాలు కాక తప్పదని మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల స్పష్టం చేశారు.