Anju yadav : వివాదాస్పద పోలీసు అధికారిణి అంజూయాదవ్ ప్రవర్తన మరోసారి కలకలం రేపింది. సిఎం జగన్ దిష్టి బొమ్మను దగ్డం చేస్తావా అంటూ జనసేన నాయకుడి చెంప చెళ్లు మనిపించింది తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. జనసేన అధినేత పవన్‌పై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా పట్టణంలోని పెళ్లిమండం వద్ద సీఎం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు జనసేన నేతలు యత్నించారు.
జనసేన నేతలపై దాడి చేసిన సీఐ అంజూ యాదవ్
అయితే దిష్టిబొమ్మ దహనానికి అంగీకరించబోమని మహిళా సీఐ అంజు యాదవ్ వారికి తెలిపారు. ఆ తర్వాత దిష్టిబొమ్మ దహనానికి యత్నించడంతో పలువురు నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. జనసేన నేతలు పోలీసులను ఏమార్చి కూడలి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో జనసేన నేతలపై సీఐ చేయిచేసుకున్నారు. ఓ నేత రెండు చెంపలపైనా ఆమె కొట్టారు. ఆమె తీరుపై జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. నడిరోడ్డుపై తమ నేతపై చేయి చేసుకున్న సిఐని సస్సెండ్ చేయాలని నినాదాలు చేశారు..
గతంలోనూ ఓ మహిళపై ఇలాగే దాష్టీకం
హోటల్ సమయానికి మూయలేదంటూ శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ ఓ మహిళపై దాడి చేసిన ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఈ ఘటనలో తక్షణం సీఐ అంజూయాదవ్‌పై కేసు పెట్టి .. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డీజీపీని ఆదేశిస్తూ లేఖ పంపింది. మహిళపై అంజూయాదవ్ దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ నేత వంగలపూడి అనిత ట్విట్టర్‌లో ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్ రేఖా శర్మకు ఫిర్యాదు చేశారు. వీడియోలు, బాధితురాలి వాంగ్మూలాన్ని చూసిన రేఖా శర్మ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.
సీఐకి దూకుడెక్కువ !
బాధిత మహిళ శ్రీకాళహస్తిలో ఓ హోటల్ నిర్వహిస్తున్నారు. మహిళ దగ్గరకు వెళ్లిన సీఐ అంజూ యాదవ్ ఆమె భర్త ఆచూకీ అడిగారు. అయితే మహిళ తెలియదని చెప్పడంతో ఆమెపై సీఐ అంజూ యాదవ్ రెచ్చిపోయారు. నడిరోడ్డుపై మహిళపై అమానుషంగా దాడి చేశారు. ఆమె చీర ఊడిపోతున్న సీఐ స్పందించలేదు. మహిళను బలవంతంగా జీప్ ఎక్కించి రాత్రి సమయంలో పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ కూడా నమోదయింది. సీఐ గతంలో వ్యవహరించిన విధానం కూడా వివాదాస్పదంగా ఉంది. తోటి పోలీసుల్ని కూడా ఆమె అసభ్యంగా తిడుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి.