చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జులై 9న చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇదివరకే చిత్తూరు పోలీసులు ఆయన హెలిప్యాడ్ కు అనుమతి ఇచ్చారు. తాజాగా పలు ఆంక్షలతో జగన్ చిత్తూరు పర్యటనకు అనుమతి ఇస్తున్నట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ తెలిపారు. జగన్ బంగారుపాళ్యం పర్యటనలో రోడ్డు షోలు, ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించడానికి వీలు లేదని స్పష్టం చేశారు. జగన్ హెలిప్యాడ్ వద్ద 30 మందికి, మార్కెట్ యార్డులో 500 మందికి మాత్రమే అనుమతిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

రైతులతో జగన్ (YS Jagan) ముఖాముఖీ..

చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ మాట్లాడుతూ.. ‘మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ జులై 9న చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పర్యటించనున్నారని పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సునీల్‌ పోలీసులకు లేఖ ఇచ్చారు. మామిడి రైతుల కష్టాలను తెలుసుకోవడానికి జగన్ వస్తున్నారని, రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారని లేఖలో తెలిపారు. వేల మంది ఈ కార్యక్రమానికి  హాజరయ్యే అవకాశం ఉందని సెక్యూరిటీతో పాటు హెలిప్యాడ్ కు పర్మిషన్ కోరారు. 

చిత్తూరు పోలీసుల ముందస్తు జాగ్రత్తలు

జగన్ ఇటీవల పర్యటనల్లో జరుగుతున్న ఘటనలు దృష్టిలో ఉంచుకుని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం. జగన్ పర్యటించనున్న బంగారుపాళ్యంతో పాటు పరిసర ప్రాంతాలను పరిశీలించాం. మాజీ సీఎం జగన్‌ వచ్చే హెలిప్యాడ్‌ వద్ద కేవలం 30 మందికే అనుమతి ఇస్తున్నాం.  బంగారుపాళ్యం మార్కెట్‌ యార్డులో రైతులతో ముఖామఖిలో గరిష్టంగా 500 మంది రైతులకు అనుమతి ఇస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ నేతలు జనసమీకరణ చెయకూడదు. రూల్స్ పాటించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా పర్యటన నిర్వహించుకోవాలి. నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం’ అన్నారు.

సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్న పోలీసులు

బహిరంగ సభ నిర్వహణకు అనుమతి కోరలేదని, ఒకవేళ పర్మిషన్ కోరితే తగిన స్థలాన్ని సూచించేవాళ్లం అన్నారు. గతంలో జగన్ హెలిప్యాడ్ వద్ద జనాలు భారీగా గుమిగూడి ధ్వంసం చేసిన ఘటన కారణంగా మాజీ సీఎం హెలిప్యాడ్ వద్దకు కేవలం 30 మందిని అనుమతిస్తున్నట్లు ఎస్పీ మణికంఠ తెలిపారు. జగన్ హెలిప్యాడ్‌ చుట్టూ డబుల్‌ బారికేడ్లతో పాటు పర్యటనలో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. వేలాది మంది గుమికూడటానికి వీల్లేదని, అందుకు తగ్గట్లుగా వైసీపీ అధినేత జగన్, పార్టీ నేతలు ఈ పర్యటన ప్లాన్ చేసుకోవాలని పోలీసులు సూచించారు.