YS Jagan and YS Sharmila | దివంగత సీఎం YS రాజశేఖర్ రెడ్డి జయంతి నేడు. ఆయన జన్మస్థలమైన పులివెందులలో ఘనంగా నివాళులర్పించేందుకు వైయస్ జగన్ , షర్మిల, విజయమ్మ అక్కడికి వెళుతున్నారు. అయితే ప్రస్తుతం అందరిలో ఉన్న ప్రశ్న అన్నా చెల్లెళ్లు ఇద్దరూ తండ్రి జయంతి సందర్భంగానన్నా కలుస్తారా లేక విడివిడిగానే తమ నివాళులర్పించి వచ్చేస్తారా అని. సగటు వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు మాత్రం అన్నా చెల్లెలు ఈ సందర్భంగానన్నా కలిస్తే బాగుంటుందని ఆశ పడుతున్నారు కానీ పరిస్థితులు దానికి అనుకూలించేలా లేవని జగన్ షర్మిల మనస్తత్వాలు తెలిసినవాళ్లు అంటున్నారు.
బద్ధ శత్రువులుగా మారిన అన్న చెల్లెళ్లు !
ఒకప్పుడు జగనన్న వదిలిన బాణం అంటూ జగన్ కోసం పాదయాత్ర చేసిన షర్మిల ఇప్పుడు అన్న పేరు చెబితేనే మండిపడుతోంది. రాజకీయంగా ఆర్థికంగా తనకు అన్యాయం చేశారు అన్న భావం అన్న వదినల పై ఆమెకు బలంగా ఉంది. మొదట్లో ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చేయగా తర్వాత తల్లి విజయమ్మ కూడా ఆమెవద్దకే చేరుకుంది. ఇక ఎన్నికల ముందు ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు హోదాలో ప్రవేశించిన షర్మిల అప్పటి ఏపీ సీఎం జగన్ ఓటమికి తన వంతు ప్రయత్నం తాను చేసింది. అయితే ప్రస్తుతం రాజకీయంగా ఇద్దరి పరిస్థితి మరీ గొప్పగా ఏమీ లేదు.
కూటమి పాలనపై ప్రజల్లో అసంతృప్తి, కానీ..
వైసిపి ఓడిపోయింది కాబట్టి ఆ పార్టీలోని వైయస్సార్ అభిమానులు తన వద్దకు వచ్చేస్తారు అనుకున్న షర్మిల ఆశలు పెద్దగా నెరవేరలేదు. జగన్ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. జగన్ పర్యటనలకు జనం వస్తున్నారు కానీ అవన్నీ ఓట్లుగా మారేంత పరిస్థితి ఉందా అనే డౌట్ చాలా మందిలో ఉంది. కూటమి ఏడాది పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉంది గానీ అది ఇంకా వ్యతిరేకత స్థాయికి మారలేదని ఎనలిస్ట్ లు అంటున్నారు. ఇలాంటి పరిస్థితులు అన్న చెల్లెళ్ళ మధ్య గతంలో ఉన్నంత తీవ్రమైన విభేదాలు ఉంటాయా అని విశ్లేషణ లు వెలువడుతున్నాయి. అయితే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు సమసి పోయే స్థితి దాటి చాలా దూరం వచ్చేసాయి అనేది వారి సన్నిహితుల మాట.
మరోవైపు బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు లో వైయస్ షర్మిల,సునీత ఒకే మాట పై ఉన్నారు. అది తేలకుండా జగన్ తో కలవడం కాదు కదా కనీసం పలకరించే పని కూడా వాళ్ళిద్దరూ చేయరు అనేది గతంలోని సంఘటనలే నిరూపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైయస్సార్ జయంతి సందర్భంగా అన్నా చెల్లెలు కలుస్తారా అనేది సందేహమే అంటున్నారు ఆ కుటుంబ సన్నిహితులు. కలవడం మాట అంటుంచి కనీసం ఒకే సమయంలో తండ్రికి నివాళులర్పించడానికి పులివెందుల ఎస్టాట్ కి వెళతారా అనేది కూడా డౌటే అంటున్నారు వారు.
అయితే తల్లి విజయమ్మ కూడా ఆ కార్యక్రమానికి వెళుతున్నారు కాబట్టి ఆమెను పలకరించడానికన్నా వైయస్ జగన్ షర్మిలను ఫేస్ చేయాల్సి వస్తుందని భావించే వాళ్ళు కూడా లేకపోలేదు. ఏమైనా తండ్రి YS రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జగన్,షర్మిల పులివెందుల వెళుతుండడంతో వాళ్ళిద్దరూ కలుస్తారా లేదా అనే దానిపై పొలిటికల్ సర్కిల్లో ఆసక్తి ఏర్పడింది.