YCP has not announced support for Karedu farmers:  నెల్లూరు జిల్లా కరేడు గ్రామ ప్రజలు ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తున్నారు. తాము భూములు ఇచ్చేది లేదంటున్నారు. సాధారణంగా ఏదైనా రాజకీయ పార్టీకి ఇలాంటి ప్రజల స్వచ్చంద ఉద్యమం లభిస్తే వెంటనే మద్దతు పలికేస్తారు. ముఖ్యంగా విపక్ష పార్టీలు ఇలాంటి అవకాశాల్ని వదులుకోవు. కానీ ఏపీలోని ప్రతిపక్షం మాత్రం  ఈ కరేడ్ రైతులకు మద్దతు పలికి..పోరాటానికి అండగా ఉంటామని ప్రకటించలేకపోతోంది. దీనిపై ఏపీ రాజకీయవర్గాల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది. పైగా  ఇండోసోల్ కు మద్దతుగా వైసీపీకి చెందిన మీడియాలో ప్రచారం చేస్తూండటంతో  మరింత షాక్‌కు గురి చేస్తోంది. 

వైసీపీ హయాంలో ఇండోసోల్‌కు భారీగా భూముల కేటాయింపు

నెల్లూరు జిల్లాలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన  భూసేకరణ ఇండోసోల్ అనే కంపెనీ కోసం. ఆ కంపెనీ సోలార్ ప్యానల్స్ తయారు చేస్తామని పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. ఇందు కోసం ఎనిమిదివేలకుపైగా  ఎకరాల కావాలని ప్రభుత్వాన్ని అడిగింది.   ఈ భూములలో ఎక్కువ భాగం సారవంతమైన వ్యవసాయ భూములు, మూడు పంటలు పండే పచ్చటి పొలాలు, ఇవి స్థానిక రైతుల జీవనాధారంగా ఉన్నాయి. 2023లో, వైసీపీ ప్రభుత్వం ఇండోసోల్ కంపెనీకి ఈ భూములను కేటాయించేందుకు సిద్ధమయింది. 

జగన్ బినామీ అని టీడీపీ ఆరోపణలు -అయినా అధికంగా భూముల కేటాయింపు

జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇండోసోల్‌కు భూముల కేటాయింపును తప్పు పట్టింది టీడీపీ. అది జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ అని ఆరోపణలు చేశారు. ఆ ప్రకారం ప్రభుత్వం మారగానే..  ఆ కంపెనీ  ఒప్పందాలను రద్దు చేసి భూములను అప్పగించకుండా వెనుకడగు వేస్తారని అనుకున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం.. మరిన్ని భూములు కేటాయించి ఆశ్చర్యపరిచింది. ఈ భూసేకరణపై వివాదం రేగడంతో వైసీపీకి ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు. తమ బినామీ కంపెనీ అని టీడీపీ నేతలు విమర్శించిన కంపెనీకే మళ్లీ ఎందుకు భూములు కేటాయించారని.. దమ్ముంటే రద్దుచేయాలని సవాల్ చేయాల్సిన వైసీపీ.. ఇప్పుడు భూ సేకరణ సరిగ్గా చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. 

పరిశ్రమ కోసమే మాట్లాడుతున్న వైసీపీ - రైతుల కోసం కాదు ! 

ఇండోసోల్ కంపెనీపై ప్రభుత్వం కుట్ర చేస్తోందని.. గతంలో వైసీపీ ప్రభుత్వం కేటాయించిన భూములను ఎందుకు ఇవ్వరని..  సారవంతమైన భూములు ఎందుకు సమీకరిస్తున్నారని ప్రశ్నిస్తోంది. ఇప్పటికే ఐదు వందల కోట్లను ఇండోసోల్ కంపెనీ భూసేకరణకు ప్రభుత్వానికి కట్టిందని చెబుతున్నారు. కంపెనీ తరపున వకాల్తా పుచ్చుకుని వైసీపీ కి చెందిన మీడియా ప్రభుత్వానికి ప్రశ్నలు వేస్తోంది కానీ.. ఆ కంపెనీ పెట్టుబడులు రద్దు చేయాలని.. భూసేకరమ వద్దని మాత్రం చెప్పడం లేదు. ఇది విపక్ష పార్టీకి మైనస్ గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇండోసోల్ కంపెనీ వైసీపీ అధినేత జగన్ కు దగ్గర వ్యక్తులదేనని అందరికీ ఓ అభిప్రాయం కలిగేలా చేస్తున్నాయి. 

మరోవైపు షర్మిల భూసేకరణకు వ్యతిరేకంగా కరేడు గ్రామానికి వెళ్తున్నారు.