ఏపీ యువ నాయకుడు B. రామచంద్ర యాదవ్ కు కేంద్ర ప్రభుత్వం అరుదైన Y+ కేటగిరి భద్రత కల్పించింది. చిత్తూరు జిల్లా, పుంగనూరుకు చెందిన జనసేన నేత రామచంద్ర యాదవ్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తూ, సేవా కార్యక్రమాలు చేపట్టడాన్ని ఓర్వలేక అధికార పార్టీ నాయకులు పోలీసులు, రెవెన్యూ అధికారుల ద్వారా అడ్డుకోవడం జరుగుతోందని రామచంద్ర యాదవ్ ఆరోపించారు. తన పోరాటాన్ని అడ్డుకోవడంతో పాటు అక్రమ కేసులను మంత్రి పెద్దిరెడ్డి పెట్టిస్తున్నారని చెప్పారు. ఆర్డీవో అధికారులు, పోలీసుల సాయంతో మంత్రి పెద్దిరెడ్డి తనపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కుటుంబానికి ప్రాణహాని ఉందని పదే పదే ఆరోపించిన రామచంద్ర యాదవ్ కేంద్రానికి ఈ విషయం తెలపగా తనకు Y+ కేటగిరి భద్రత కల్పించారని స్పష్టం చేశారు.
హత్యా ప్రయత్నం ఆరోపణలు చేసిన రామచంద్ర యాదవ్
2022 డిసెంబర్ 4వ తేదీ వివిధ రంగాల రైతులకు జరుగుతున్న అన్యాయాలు, దోపిడీలు, సమస్యలపై సదుంలో రైతుభేరి బహిరంగసభ నిర్వహించకుండా పోలీసులు వివిధ కారణాలు చూపుతూ అడ్డుకున్నారు. పుంగనూరులో ఆర్సీవై మెగా జాబ్ మేళా ద్వారా 10 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా పోలీసులు అడ్డుకోవడం, రైతు భేరిని అడ్డుకోవడం అలాంటి అనేక సంఘటనలు జరిగాయని ఓ వీడియో విడుదల చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయకుండా ఆయన రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, ప్రజలు, రైతుల సమస్యలపై నిలదీస్తే పోలీసుల ద్వారా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వీటిపై మాట్లాడినందుకు తన ఇంటిపై మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు, వైసిపి కార్యకర్తలు 300 మంది దాడికి పాల్పడి తన కుటుంబంపై హత్యాయత్నానికి పాల్పడినట్లు ఈ నెల 11వ తేదీన న్యూఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిసి వివరించానని చెప్పారు.
పుంగనూరులో దౌర్జన్యాలు, ఇంటిపై దాడి, తమ కుటుంబంపై హత్యాయత్నంపై అమిత్ షా తన వద్ద సమాచారం ఉందని త్వరలోనే కేంద్ర బలగాలతో రక్షణ కల్పిస్తానని భరోసా ఇచ్చిన 10 రోజుల్లోనే హోంశాఖ ద్వారా Y+ కేటగిరి భద్రత మంజూరు చేసి పంపించారని తెలిపారు. తనకు భద్రత కల్పించిన కేంద్ర మంత్రి అమిత్ షాకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రామచంద్ర యాదవ్. రాబోయే రోజుల్లో వైసీపీ నేతలు, మంత్రి పెద్దిరెడ్డి రాష్ట్రంలో చేస్తున్న అరాచకాలు, అవినీతిని అడ్డుకునేందుకు తన వంతు ప్రయత్నం కొనసాగిస్తానని రామచంద్ర యాదవ్ తెలిపారు.
దేశంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు Y+ భద్రత కల్పిస్తుంది. కేంద్ర సాయుధ పోలీసులు, కమాండోలతో ఇంటి వద్ద స్కానింగ్ భద్రత, దేశంలో ఎక్కడ పర్యటించినా రామచంద్ర యాదవ్ కు రక్షణలో 24 గంటలు భద్రతా విధులు నిర్వహిస్తారు. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం y వై కేటగిరి భద్రత కల్పించగా యువ నాయకుడు రామచంద్ర యాదవ్ కు మాత్రం కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అరుదైన Y+ భద్రత కల్పించడం గమనార్హం. న్యూఢిల్లీ నుంచి Y+ కేటగిరీకి చెందిన భద్రత సాయుధ పోలీసులు పుంగనూరుకు చేరుకున్నారు.