YV Subba Reddy On Drone Video : ఆగమశాస్ర్త నిబంధనల మేరకు ఆనంద నిలయ గోపురం చిత్రీకరణకు అనుమతులు లేవని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. శ్రీవారి ఆలయాన్ని చిత్రీకరించి, సోషల్ మీడియాలో వైరల్ చేసిన విజువల్స్ పై విచారణ జరుపుతున్నామన్నారు. హైదరాబాద్ కు చెందిన వారు విజువల్స్ ని అప్లోడ్ చేసినట్లు గుర్తించామన్నారు. వీళ్లపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు.  స్టిల్ ఫొటోగ్రాఫర్ తీసిన వీడియోలుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కుట్ర కోణంలో టీటీడీపై దుష్ప్రచారం చేస్తున్నారా అనే దిశగా కూడా విచారణ జరుపుతున్నామన్నారు. రెండు, మూడు రోజులలో వాస్తవాలను భక్తులు ముందు ఉంచుతామని సుబ్బారెడ్డి చెప్పారు.


క్రిమినల్ కేసులు నమోదు


తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్లను ఎగురవేసి ఆలయ ఏరియల్ వ్యూను చిత్రీకరించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై ఇప్పటికే టీటీడీ అధికారులు స్పందించి బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇదే అంశంపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పదించారు. శ్రీవారి ఆలయంపై భాగంలో, పరిసరాల్లో గానీ విమానాలు, డ్రోన్ లు తిరిగేందుకు అనుమతులు లేవని ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.  ఆగమ సలహా‌మండలి సూచన మేరకూ ఆలయంపై విమానాలు, డ్రోన్ లు‌ నిషేధం ఉందన్నారు. నిన్న సోషల్ మీడియాలో స్వామి వారి ఆలయం డ్రోన్ వీడియో వైరల్ అయినట్లు తెలిసిందన్నారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు వెంటనే స్పందించి సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిని గుర్తించారన్నారు. హైదరాబాదుకు చెందిన ఓ సంస్థ డ్రోన్ ద్వారా చిత్రీకరించిన వీడియోను పోస్టు చేసినట్లు నిర్ధారణకు వచ్చామని సుబ్బారెడ్డి తెలిపారు.  సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారిపై క్రిమినల్ కేసు పెడుతున్నామన్నారు.  దీనిపై టీటీడీ విజిలెన్స్ అధికారుల దర్యాప్తునకు ఆదేశించామని తెలియజేశారు. 


ఫోరెన్సిక్ ల్యాబ్ కు వీడియో 


డ్రోన్ ద్వారా తీసిన వీడియోలు, స్టిల్ ఫొటో గ్రాఫర్ ద్వారా చిత్రీకరించిన వీడియోనా, లేక పాత చిత్రాలతో త్రిడీ లాగా రూపొందించారా అనే అంశంపై దర్యాప్తు సాగుతోందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ వీడియోలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించినట్లు స్పష్టం చేశారు. రాబోయే నాలుగు, ఐదు రోజుల్లోనే దీనిపై ఓ క్లారీటీకి వస్తామన్నారు.  స్టిల్ కెమెరాతో ఫొటోలను మార్పింగ్ చేసి‌ చిత్రీకరించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. త్వరలోనే దీనిపై వాస్తవాలు వెలికి తీసి‌ భక్తుల ముందు ఉంచుతామన్నారు. అనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు మాట్లాడుతూ....డ్రోన్ కెమెరాలతో శ్రీవారి ఆలయ ఏరియల్ వ్యూను వీడియో తీసి సామజిక మాధ్యమాలలో వైరల్ చేశారన్నారు. సంప్రదాయంలో భాగంగా కొన్ని నియమనిబంధనలు అమలు చేస్తున్నామని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు నియమనిబంధనలు అతిక్రమించి డ్రోన్ ద్వారా దేవాలయాన్ని చిత్రీకరించారన్నారు. స్వామి వారి ఆలయంపై విమానాలు, డ్రోన్లు ఎగురరాదనే వినతి కేంద్ర ప్రభుత్వానికి పంపించామన్నారు. దీనిపై అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నామన్నారు.  తిరుమల క్షేత్రం అంతా డ్రోన్స్., విమానాలను ప్రయాణించరాదనే నిబంధనలు ఆగమశాస్త్రం చెపుతోందని స్పష్టం చేశారు.