చిత్తూరు జిల్లాలో ఏనుగుల వరుస దాడులు కొనసాగుతున్నాయి. అటవీ ప్రాంతాల నుంచి పొలాల్లోకి వస్తున్న గజరాజులు.. తమ భారీ దేహంతో బీభత్సం సృష్టిస్తున్నాయి. పొలాల్లో పనులు చేసుకునే వారిపై దాడులు చేస్తున్నాయి. ఇటీవల ఈ తరహా దాడులు తరచూ నమోదు అవుతున్నాయి. పంట పొలాలను నాశనం చేయడం, వాటిని తరిమి కొట్టడానికి ప్రయత్నించిన వారిపై, పొలాల్లో పనులు చేసుకుంటున్న వారిపై దాడి చేసి హతమారుస్తున్నాయి. ఏనుగుల దాడుల వల్ల ఒక వైపు పంట చేలు నాశనమై ఆర్థికంగా నష్టపోవడంతో పాటు.. వాటి దాడిలో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా చిత్తూరు జిల్లా పరిధిలో ఇలాంటి మరో ఏనుగు దాడి ఘటన వెలుగు చూసింది.


చిత్తూరు జిల్లా 190 రామాపురం లో ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది. ఏనుగు దాడిలో భార్యాభర్తలు మృతి చెందారు. అంతటితో ఏనుగు శాంతించకుండా పశువుల్ని తొక్కేసుకుంటూ వెళ్లి మామిడి తోటలోకి ప్రవేశించింది. అదే సమయంలో మామిడి తోటలో ఉన్న సీకే పల్లి గ్రామానికి చెందిన కార్తీక్ అనే వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఇంతటితో ఆగకుండా సమీపంలోని పొలాల్లోకి వెళ్తూ ఎదురొచ్చిన పశువులపై విరుచుకుపడింది. ఇదే క్రమంలో ఆవు దూడ కూడా మృతి చెందాయి.


 అటువైపు నుంచి పొలంలోకి వెళ్లి అక్కడ గడ్డి కోస్తున్న గుడిపాల మండలం రామాపురం కు చెందిన వెంకటేష్ , సెల్వి అనే దంపతులను ఏనుగు తొక్కేసింది. దంతాలతో పొడిచింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. దాడి అనంతరం ఏనుగు అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. ఈ ఘటనలో అటవీ అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తులు ఆందోళన చేశారు. ఉదయం దాడి చేసినప్పుడే అధికారులకు సమాచారం ఇచ్చామని, అయినా కానీ వారు ఆలస్యంగా ఘటన స్థలానికి చేరుకోవడంతో అప్పటికే ఇద్దరి ప్రాణాలు పోయాయని బాధిత బంధువులు ఆరోపించారు. 


ఏనుగు బీభత్సం, అంతా నాశనం.........


ఏనుగుల మంద నుంచి బయటకు వచ్చిన ఒంటరి ఏనుగు తన చేష్టలతో విరుచుకుపడుతోంది. పంట పొలాలను ధ్వంసం చేయడంతో పాటుగా పశువుల స్థావరాలపై దాడులకు దిగుతూ పశువులను తొక్కి కాళ్ళు, నడుము విరిచేస్తున్నాయి.. దీంతో పగలు, రాత్రి తేడా లేకుండా అటవీ సమీప‌ ప్రాంతాల ప్రజలు, రైతులు  బెంబేలెత్తిస్తోంది. ఒంటరి ఏనుగు కంటిమీద కునుకులేకుండా చేస్తుండడంతో అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ అటవీ‌ సమీప ప్రాంతం ప్రజలు భయాందోళనలో ఉన్నారు.


ఈ క్రమంలో గోనుమాకులపల్లి  గ్రామానికి చెందిన రైతు రఘుపతి పశువులపాకపై దాడి చేసింది. పశువు నడుము,కాళ్లు విరిచి గాయపరిచింది.. బీన్స్ తోటను తొక్కి తిని నాశనం చేసింది.. లక్షల రూపాయాల నష్టాన్ని మిగుల్చుతోంది.. పశువుల పాకలో పశువుల కోసం నిలువ ఉంచిన దాణ ఆరగించేందుకే పాకలపై దాడి చేస్తోందని రైతులు చెబుతున్నారు. వారం రోజులుగా అటవీ సరిహద్దు రైతులకు నిద్ర లేకుండా చేస్తుంది.


రోడ్డుపై బాధితుల ఆందోళన....
అధికారుల నిర్లక్ష్యం వల్ల భార్యాభర్తల ప్రాణాలు పోవడంతో ఆగ్రహించిన బంధువులు రోడ్డుపై బైఠాయించారు. సంబంధిత అధికారులు వచ్చి న్యాయం చేయాలని కోరారు. దీంతో అటవీ శాఖ అధికారి చైతన్య కుమార్ వచ్చి గ్రామస్తులతో మాట్లాడారు. మృతి చెందిన భార్యాభర్తల కుటుంబానికి 10 లక్షల పరిహారం ప్రకటించడంతో ఆందోళన విరమించారు.  ఇకనైనా జిల్లా కలెక్టర్ స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకొని..ఒంటరి ఏనుగు దాడుల నుంచి పంట పొలాలను పశువుల పాకలను రక్షించాలని రైతులు కోరుతున్నారు.