చిన్నారి లక్షితను చంపింది చిరుతా? ఎలుగుబంటా? అనే అనుమానానికి వైద్యులు ఫుల్‌స్టాప్ పెట్టారు. చిరుత దాడి చేసినట్టు వైద్యులు స్పష్టం చేశారు. దాడి జరిగిన ప్రదేశంలో కూడా చిరుత ఆనవాళ్లు గుర్తించినట్టు ఫోర్సెక్ నిపుణులు క్లారిటీ ఇచ్చేశారు. 


శ్రీనివాసుడికి చెల్లించుకోవాల్సిన మొక్కును తీర్చుకోవడానికి బయల్దేరింది లక్షిత ఫ్యామిలీ. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డి పాలెం వాసులు దినేష్, శశికళ కుటుంబం ఏడు కొండ వేంకటేశ్వర స్వామిని చూసేందుకు వచ్చారు. పదిమంది కలిసి వెళ్తున్నందున కాలినడకన కొండకు వెళ్లాని నిర్ణయించుకున్నారు. 


అలిపిరిలోని నడక మార్గంలో  రాత్రి ఎనిమిది గంటలకు బయల్దేరారు. రాత్రి 11 గంటలకు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఫ్యామిలీలో ఎప్పుడూ హుషారుగా ఉండే లక్షిత వడివడిగా అడుగులు ఆడుతూ పాడుతూ ముందుకెళ్లింది. 


సీసీ కెమెరాల్లో ఆ విషయం స్పష్టంగా కనిపించింది. ఆనందంగా అందరి కంటే చురుగా మెట్లు ఎక్కుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అలా రాత్రి 11 గంటల సమయానికి  లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్దకు చేరుకునే సరికి పాప కనిపించలేదు. 


రాత్రి వేళలో పాప లక్షిత కనిపించకపోయే సరికి తల్లిదండ్రులతోపాటు వారితో వచ్చిన వారిలో కంగారు మొదలైంది. మొత్తం వెతికారు. పిలిచారు అయినా లక్షిత పలకలేదు. ఏం జరిగిందో ఏమో అనుకున్నారు. వెంటనే ఆలయ భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేశారు. 


పాప కనిపించడం లేదని తెలుసుకున్న టీటీడీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. వడివడిగా ముందుకు నడుకుంటూ వెళ్లిన పాపను ఎవరైనా ఎత్తుకెళ్లిపోయారేమో అన్న కోణంలోనే వేట సాగించారు. ఉదయం చెట్ల పొదల్లో కాలిమార్గంలో డెడ్ బాడీ చూసేవరకు మాత్రం వాళ్లుకు చిరుత దాడి చేసిన సంగతి గమనించలేకపోయారు. 


ఆలయం వద్ద పాపపై చిరుత దాడి చేసి లాక్కెళ్లిపోయినట్టు ఇప్పుడు అక్కడ దృశ్యాలు చూస్తుంటే అర్థమవుతుంది. అలా ఉదయం భక్తులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకునే చేరికి చిద్రమై ఉన్న పాప శరీర బాగాలు కనిపించాయి. మొదట ఇది చిరుత దాడి అంటూ చెప్పిన అధికారులు తర్వాత మాట మార్చారు. 


చిరుత దాడి చేసే అవకాశం లేదని ఎలుగుబంటి దాడి చేసి ఉండొచ్చని అనుమాన పడ్డారు.  దీంతో అందరిలోనూ అనమానాలు కలిగాయి. అయితే పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు చిరుత దాడిలో పాప చనిపోయిందని క్లారిటీ ఇచ్చేశారు. 


రుయా ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసిన తర్వాత లక్షిత డెడ్‌బాడీని నెల్లూరుజిల్లాలోని స్వస్థలానికి తరిలించారు. చెంగుచెంగున లేడి పిల్లలా ఎగురుతూ కళ్లెదుటే మెట్లు ఎక్కిన చిన్నారి ఇలా కనిపించే సరికి దినేశ్ ఫ్యామిలి షాక్ తింది. వారి రోధనలకు అంతులేకుండా పోయింది. తల్లిదండ్రులతో పాటు వచ్చిన కుటుంబ సభ్యులు ఏడుపు అక్కడి వారందరనీ కంట తడి పెట్టించింది.