Attack on Pulivarthi Nani: చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది. తిరుపతి పద్మావతి కాలేజ్ సమీపంలో వెళ్తున్న పులివర్తి నానిపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. పద్మావతి యూనివర్సిటలో ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూం ఉంది. అక్కడ భద్రతను పరిశీలించేందుకు పులివర్తి నాని అక్కడి వెళ్లగా.. తిరుగు ప్రయాణంలో ఈ దాడి జరిగింది. వైసీపీ కార్యకర్తల దాడిలో నాని భద్రతా సిబ్బందికి గాయాలు అయ్యాయి. ఈ క్రమంలో పులివర్తి నాని కారు కూడా ధ్వంసం అయింది. ఆ దాడిని నిరసిస్తూ మహిళా యూనివర్సిటీ రోడ్డుపైనే నాని బైఠాయించి నిరసన తెలిపారు. వైసీపీ శ్రేణులను చెదరగొట్టేందుకు పులివర్తి నాని భద్రతా సిబ్బంది గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు కూడా జరిపారు.
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఇలాంటి పరిస్థితులు ఆగడం లేదు. పులివర్తి నానిపై జరిగిన దాడి ఘటనలో ఆయన భద్రతా సిబ్బందికి తలపై గాయం అయింది. ఈ దాడి గురించి విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పద్మావతి మహిళా యూనివర్సిటీకి చేరుకున్నారు. నిందితులు ప్రాంగణం లోపలే ఉండి ఉంటారని భావించి వారి కోసం మొత్తం గాలించారు. కానీ, ఘటన జరిగిన ప్రాంతంలో ఓ ఎరుపు రంగు హ్యుండయ్ ఆరా AP 39 MF 5788 కారును టీడీపీ కార్యకర్తలు గుర్తించారు. అందులో వైసీపీ జెండాలు, కండువాలు, మద్యం బాటిళ్లు ఉండడంతో టీడీపీ నేతలు ఆ కారును పూర్తిగా ధ్వంసం చేశారు. స్ట్రాంగ్ రూం వద్ద వైసీపీ కార్యకర్తలు ఏం చేస్తున్నారని టీడీపీ నేతలు ప్రశ్నించారు.
అయితే, ఈ దాడికి పాల్పడిన వ్యక్తి.. రామాపురంకు చెందిన వైసీపీ నేత భాను అతని అనుచరులు అని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వారు పులివర్తి నాని కారుపై సుత్తి, రాడ్లతో దాడికి యత్నించినట్లుగా గన్ మ్యాన్ తెలిపారు. ఈ రాళ్ల దాడిలో గన్ మ్యాన్ ధరణి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆత్మరక్షణ కోసం గన్ మ్యాన్ ధరణి గాల్లో కాల్పులు జరిపారు. టీడీపీ నేతలు గన్ మ్యాన్ ను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.