Ragging in Chandragiri: చంద్రగిరి ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో ర్యాగింగ్ జరిగినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని చంద్రగిరి సీఐ రాజశేఖర్ తెలిపారు. తిరుపతి రూరల్ మండలానికి చెందిన ఓ బాలిక చంద్రగిరి ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అక్కడ ఆ బాలిక ర్యాగింగ్ చేస్తోందని ఈ నేపథ్యంలోనే విద్యార్థి జుట్టు కత్తిరించుకుందనే వార్తలు వచ్చాయి. దీనిపై ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి విచారణకు ఆదేశించారు. చంద్రగిరి సీఐ రాజశేఖర్, ఉమెన్ ఎస్‌ఐ హిమబిందు దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని తల్లితో మాట్లాడారు. 


విచారణలో ర్యాగింగ్ అవాస్తమని తేలిందని సీఐ తెలిపారు. ఆయన వివరాల మేరకు.. విద్యార్థి హాస్టల్లో ఉండలేక ఇంటి నుంచి స్కూలుకు రావాలనే అనుకుంది. కానీ తల్లి ఒప్పుకోకపోవడంతో సహ విద్యార్థినితో తన జుట్టును కత్తిరించుకొని ర్యాగింగ్ పేరుతో వేరే ఎవరో విద్యార్థిని జుట్టు కత్తిరించినట్లుగా హాస్టల్ వార్డెన్‌, తల్లికి తెలిపింది. దీంతో విద్యార్థి తల్లి గీత హాస్టల్ వద్దకు చేరుకుని జరిగిన విషయంపై నిలదీశారు. ఆ సమయంలో జరిగిన వివాదం వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారాయి. 


అనంతరం విద్యార్థిని, ఆమె తల్లి గీతా, హాస్టల్ వార్డెన్లతో మాట్లాడిన తర్వాత సదరు విద్యార్థిని ఇంటి పైన బెంగతో హాస్టల్లో ఉంటూ స్కూలుకు వెళ్లడం ఇష్టం లేక ఈ ప్రయత్నం చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. ఈ సంఘటనలో ఎవరి ప్రమేయం లేదని, ఈ సమస్య పరిష్కరించినట్లుగా సీఐ తెలిపారు. ఏదైనా అవాంఛనీయమైన సంఘటనలు జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఆ సమస్యకు వెంటనే పరిష్కారం చూపగలమని హాస్టల్ వార్డెన్‌కు సీఐ తెలిపారు.


అంతకు ముందు ఏం జరిగిందంటే?
తిరుపతిలోని చంద్రగిరి బాలికల హాస్టల్ లో ర్యాగింగ్ కలకలం అంటూ సోషల్ మీడియా గ్రూపుల్లో వార్తలు వైరల్ అయ్యాయి. అమ్మాయిలు  గ్రూపులుగా ఏర్పడి ర్యాగింగ్ చేస్తున్నారంటూ ప్రచారం జరిగింది. ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌లో తిరుపతి రూరల్ మండలానికి చెందిన ఓ బాలిక ఉంటూ.. చంద్రగిరి పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. వసతి గృహంలో ఉండే కరకంబాడికి చెందిన ఓ విద్యార్థిని ఆ బాలికను రోజూ ర్యాగింగ్ చేస్తోందని, ఆ బాధ భరించలేకపోయిందని, వాటి నుంచి తప్పించుకోవడానికి, ఆ హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లిపోవడానికి జుట్టు కత్తిరించుకుందని ప్రచారం జరిగింది. 


విషయం తల్లిదండ్రులకు ఫోన్ చేసి హాస్టల్లో ఉండలేనని తల్లిదండ్రులకు చెప్పుకుంది. దీంతో ఆ విద్యార్థిని తల్లి వసతి గృహానికి చేరుకుని విచారించగా కరకంబాడికి చెందిన విద్యార్థిని ర్యాగింగ్ చేసిందని చెప్పినట్లు వైరల్ అయ్యింది. దీంతో బాధితురాలి తల్లి 100కు డయల్ చేసి విషయం చెప్పారు బాధిత బాలిక తల్లి. వారు చంద్రగిరి పోలీసులతో కాన్ఫరెన్స్ పెట్టగా.. స్థానిక పోలీసులు బాధిత బాలికను, కత్తిరించిన జుట్టును స్టేషన్ కు తీసుకురావాల్సిందిగా చెప్పారు. దీంతో పోలీసు స్టేషన్ కు వెళ్లడం ఇష్టం లేని బాధిత బాలిక తల్లి.. ర్యాగింగ్ విషయంపై హాస్టల్ వార్డెన్ వహిముద్దీన్ కు ఫిర్యాదు చేశారు. అయితే ఇదంతా సోషల్ మీడియాలో రావడంతో ఎస్పీ విచారణకు ఆదేశించారు.