Illegal Sand Mining In Chandragiri: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రెడ్డివారిపల్లెలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇసుక కాంట్రాక్టు గడువు ముగిసినా కూడా భారీ యంత్రాలతో ఇసుక తరలిస్తుండగా వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కంపెనీ మనుషులకు, వైసీపీ వర్గీయులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు సైతం జోక్యం చేసుకోవడంతో వైసీపీ నేత సీఐ రాజశేఖర్ రెడ్డి కాళ్లు పట్టుకున్నారు.


రెడ్డివారిపల్లె సమీపంలో ఉన్న స్వర్ణముఖి నది ప్రాంతం నుంచి జయప్రకాష్ కంపెనీ ఇసుక రీచ్ కు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందింది. గత నెలలో గడువు ముగిసినా కూడా కాంట్రాక్టర్ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని వారం రోజులుగా స్థానికులు, ప్రతిపక్ష టీడీపీ నేతలు పోరాటం చేస్తున్నారు. తాజాగా వైసీపీ నాయకులు సైతం రంగంలోకి దిగారు. స్వర్ణముఖి నది ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణాను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. 
అయినా లెక్కచేయకుండా కంపెనీకి చెందినవారు ఇసుక తరలిస్తుండగా నరసింగాపురం సింగిల్ విండో అధ్యక్షుడు మల్లం చంద్రమౌళి రెడ్డి జయప్రకాష్ కంపెనీ ప్రతినిధులను నిలదీశారు. ఈ క్రమంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. కంపెనీ ప్రతినిధులను అరెస్ట్ చేయాలని మల్లం చంద్రమౌళి రెడ్డి పోలీసుల కాళ్లపై పడ్డారు. పోలీసులు స్పందించక పోవడంతో రీచ్ దగ్గర వైసీపీ నాయకులతో కలిసి ధర్నాకు దిగారు. న్యాయం జరగకపోతే అనుచరులతో కలిసి మూకుమ్మడి రాజీనామాకు సిద్ధమయ్యారు. పోలీసులు వారిని వారించి అందరినీ స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు.


ఆ పోలీసుల అండదండలతోనే ఇసుక అక్రమ రవాణా!
ఏఎస్పీ నితిన్ చుట్టుపక్కల ప్రాంతాల ట్రాక్టర్ల ఓనర్లను, రైతులను భయబ్రాంతులను గురిచేసి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. ఆయనను అతిక్రమించి టిప్పర్ ఓనర్ గానీ, ట్రాక్టర్ ఓనర్ గానీ ఇసుక రవాణా చేస్తే ఆ ఇంటి యాజమానుల మీద అక్రమంగా కేసులు పెడుతున్నారని చెప్పారు. ఎమ్మార్ పల్లె పోలీస్ స్టేషన్ లో ఇదే విధంగా ఓ కుటుంబంపై అన్యాయంగా కేసులు బనాయించారని ఆరోపించారు. ఏఎస్పీ, ఏసీపీలకు మధ్య ఏం జరుగుతుంది, ఇసుక అక్రమ రవాణాకు వీరికి ఉన్న రిలేషన్ ఏంటన్నది ఫోన్ కాల్ డేటా సేకరించి విచారణ చేపట్టాలని వైసీపీ నేత మల్లం చంద్రమౌళి రెడ్డి డిమాండ్ చేశారు. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial