Tirumala news: తిరుమల శ్రీవారి ప్రసాదంలో అతి ప్రీతికరమైన లడ్డూ ప్రసాదం వివాదం పెద్ద దుమారమే రేపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటనతో పెద్ద వివాదానికి దారి తీసింది. చరిత్రలో ఎన్నడు లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటనతో ఈ అంశం నేషనల్ మీడియాలో నిలిచింది. చాల సున్నితమైన అంశం... పైగా కోట్ల మంది హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశం కావడంతో పెద్ద ఎత్తున ఉద్యమానికి సైతం సిద్ధమయ్యారు. టీటీడీ ఈవో సైతం కొంత భిన్న మాటలు మాట్లాడడం ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ దానిని సుప్రీం కోర్టు వరకు తీసుకెళ్ళింది.
సీబీఐ ఆధ్వర్యంలో సిట్
లడ్డూ వివాదంలో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసి సిట్ ఏర్పాటు చేసింది. మొత్తం 12 మంది సభ్యులతో కూడిన సిట్ బృందం తిరుపతిలో 5 రోజులపాటు పరిశీలన చేసింది. తిరమల తిరుపతి నెయ్యి సరఫరా చేసిన తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ పూడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని సందర్శించింది. సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు సీబీఐ ఆధ్వర్యంలో మరో సిట్ ఏర్పాటు చేయడంతో 5రోజుల పాటు జరిగిన విచారణ అర్థాంతరంగా ముగిసింది. అయితే ఆ విచారణ నివేదిక ఏమి చేసారో.. దానిని కొత్త సిట్ పరిగణలోకి తీసుకుంటుందా లేదా విచారణ తొలి నుంచి ప్రారంభిస్తుందో వేచి చూడాలి.
Also Read: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి 62 ప్రత్యేక రైళ్లు
విస్తృతంగా విచారణ
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఆధ్వర్యంలో 5 మంది సభ్యులతో కూడిన సిట్ ఏర్పాటైంది. ఇందులో ఇద్దరు సీబీఐ నుంచి, ఇద్దరు రాష్ట్ర నుంచి కాగా ఒక్కరు ఫుడ్ సేఫ్టీలోని అధికారి ఉన్నారు. వీరు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌లో కార్యాలయంలో ఏర్పాటు చేసుకుని పని ప్రారంభించారు. వీరికి సహాయంగా మొత్తం 35 మంది సభ్యులను తీసుకున్నారు.
ఒక బృందం తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ గోడాములో పలు ఫైల్స్ తీసుకున్నారు. ఒక బృందం తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో సమావేశం నిర్వహించారు. మరో రెండు బృందాలు తమిళనాడు దిండుగల్‌లోని ఏఆర్ డైరీ పూడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు, ఇంకొక టీం నెల్లూరుకు సమీపంలోని వైష్ణవి డైరీకి వెళ్లాయి. అక్కడ నెయ్యికి సంబంధించిన పలు అంశాలపై పరిశీలనతోపాటు రికార్డులు, సీసీ టీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నారు.
ఒక్క తమిళనాడులోని ఏఆర్ డైరీలోనే సుమారు 13 గంటల పాటు సోదాలు నిర్వహించారు సీబీఐ బృందంలోని సభ్యులు. నెయ్యి తయారీకి పాలు కొనుగోలు నుంచి నెయ్యి మార్పు చేసే విధానం వరకు పూర్తిగా అధ్యాయనం చేశారు. లడ్డూ కల్తీ కాలేదని ఏఆర్ డైరీ తెచ్చిన రిపోర్టులను సైతం జారీ చేసిన ల్యాబ్ వివరాలు.. వాటి నమూనాలు.. టీటీడీకి సరఫరా చేసిన రిపోర్టులు.. ల్యాబ్ శ్యాంపుల్స్ తీసుకున్నారు. విచారణ మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. తిరుమలలో విచారణ చేసిన అనంతరం ప్రాథమిక నివేదిక అందిస్తారా లేక పూర్తి విచారణ తరువాత నివేదిక సుప్రీం కోర్టుకు అందజేస్తారు అనేది వేచి చూడాల్సిందే.