SCR Special Trains To Sabarimala: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల (Sabarimala) అయ్యప్ప దర్శనం కోసం వెళ్లే భక్తులకు ద.మ రైల్వే (South Central Railway) గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల రద్దీ దృష్ట్యా భారీగా ప్రత్యేక రైళ్లను (Special Trains) నడిపేందుకు సిద్ధమైంది. విశాఖ, శ్రీకాకుళం రోడ్, హైదరాబాద్, కాచిగూడ నుంచి కొల్లం, కొట్టాయంలకు 62 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ సర్వీసులు డిసెంబర్ 1 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 వరకూ వివిధ తేదీల్లో విశాఖ, శ్రీకాకుళం నుంచి కొల్లం వరకూ నడవనున్నాయి. వీటిలో విశాఖ - కొల్లం - విశాఖ ప్రత్యేక రైళ్లు (08539/08540) డిసెంబర్ 4 నుంచి ఫిబ్రవరి 27 వరకూ 26 సర్వీసులు అందించనున్నాయి.
ప్రత్యేక రైళ్ల వివరాలు
- విశాఖ - కొల్లం ప్రత్యేక రైలు (నెం. 08539) ప్రతి బుధవారం (డిసెంబర్ 4) ఉదయం 8:20 గంటలకు విశాఖలో బయల్దేరి గురువారం మధ్యాహ్నం 12:55 గంటలకు కొల్లం చేరుకుంటుంది. అలాగే, కొల్లం - విశాఖ రైలు (నెం.08540) డిసెంబర్ 5 నుంచి ఫిబ్రవరి 27 వరకూ ప్రతి గురువారం కొల్లంలో రాత్రి 7:35 గంటలకు బయల్దేరి శుక్రవారం రాత్రి 11:20 గంటలకు విశాఖ చేరుకుంటుంది.
- అలాగే, శ్రీకాకుళం రోడ్ - కొల్లం - శ్రీకాకుళం రోడ్ మధ్య 18 సర్వీసులు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. వీటిలో శ్రీకాకుళం రోడ్ - కొల్లం మధ్య డిసెంబర్ 1వ తేదీ నుంచి జనవరి 27 వరకూ ప్రత్యేక రైలు సర్వీసు అందించనుంది. ఈ రైలు (నెం. 08553) ప్రతీ సోమవారం ఉదయం 6 గంటలకు శ్రీకాకుళం రోడ్ స్టేషన్‌లో బయల్దేరి మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు కొల్లం చేరుకుంటుంది.
- తిరుగు ప్రయాణంలో రైలు (నెం.08554) ప్రతి సోమవారం కొల్లంలో సాయంత్రం 4:30 గంటలకు బయల్దేరి.. బుధవారం తెల్లవారుజామున 2:30 గంటలకు శ్రీకాకుళం చేరుకోనుంది.
- మరోవైపు, కాచిగూడ - కొట్టాయం - కాచిగూడ మధ్య డిసెంబర్ 5 నుంచి 27 వరకూ ప్రతి గురు, శుక్రవారాల్లో ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. కాచిగూడ - కొట్టాయం (07133) రైలు డిసెంబర్ 5, 12, 19, 26 తేదీల్లో (ప్రతీ గురువారం) మధ్యాహ్నం 3:40 గంటలకు కాచిగూడలో బయల్దేరి శుక్రవారం సాయంత్రం 6:50 గంటలకు కొట్టాయం చేరుకోనుంది.
- అలాగే, డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో (ప్రతీ శుక్రవారం) ప్రత్యేక రైలు (07134) రాత్రి 8:30 గంటలకు కొట్టాయంలో బయల్దేరి శనివారం రాత్రి 11:40 గంటలకు కాచిగూడ చేరుకోనుంది.
- హైదరాబాద్ - కొట్టాయం - హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు డిసెంబర్ 3 నుంచి జనవరి 1 వరకు ప్రతి మంగళ, బుధవారాల్లో రాకపోకలు సాగించనున్నాయి. హైదరాబాద్ - కొట్టాయం (07135) ప్రత్యేక రైలు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 4:10 గంటలకు కొట్టాయం చేరుకోనుంది.
- అలాగే, కొట్టాయం - హైదరాబాద్ ప్రత్యేక రైలు (07136) బుధవారం సాయంత్రం 6:10 గంటలకు కొట్టాయంలో బయల్దేరి మరుసటి రోజు రాత్రి 11:45 గంటలకు హైదరాబాద్ చేరుకోనుంది.
శబరిమలకు పోటెత్తిన భక్తులు
అటు, శబరిమలకు భక్తులు పోటెత్తారు. గతేడాదితో పోలిస్తే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. మండల - మకరవిళక్కు సీజన్‌లో భాగంగా మొదటి 9 రోజుల్లోనే 6 లక్షల మందికిపైగా భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకున్నారని ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు వెల్లడించింది. ఈ నెల 16న ఆలయం తెరుచుకోగా.. ఇప్పటివరకూ 6,12,290 మంది దర్శించుకున్నట్లు తెలిపింది. శనివారం వరకూ రూ.41.64 కోట్లు విరాళాల రూపంలో వచ్చాయని పేర్కొంది. మరోవైపు, భక్తుల కోసం వసతులు కల్పిస్తున్నామని అధికారులు వెల్లడించారు. వండిపెరియార్ సత్రం, ఎరుమేలి, పంబాలలో 3 ఆన్ లైన్ బుకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు.