Bhanuprakash Reddy alleges theft of Rs 100 crore in TTD Parakamani: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు మరియు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి. భానుప్రకాష్ రెడ్డి, శ్రీవారి హుండీ డబ్బు లెక్కించే విభాగం పరకామణిలో రూ.100 కోట్లకు పైగా దొంగతనం జరిగినట్లు తీవ్ర ఆరోపణలు చేశారు. 2023 ఏప్రిల్‌లో జరిగిన ఒక చిన్న దొంగతనం ద్వారా బయటపడిన ఈ కుంభకోణం, గత వైఎస్ఆర్‌సీపీ హయాంలో కుట్రగా భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు.
భానుప్రకాష్ రెడ్డి ఆరోపణల ప్రకారం, 2023 ఏప్రిల్ 29న టీటీడీ విజిలెన్స్ మరియు సెక్యూరిటీ విభాగం సిబ్బంది, పెద్ద జీయర్ మఠంలో క్లర్క్‌గా పని చేసే సి.వి. రవి కుమార్‌ను రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్నారు. పరకామణి హాల్‌లో శ్రీవారి హుండీ దానాలు లెక్కించే పనిలో మఠం ప్రతినిధిగా ఉన్న రవి కుమార్, విదేశీ కరెన్సీ 900 డాలర్లు, సుమారు రూ.72,000 ను తన ఇన్నర్ వేర్‌లో దాచుకుని బయటకు వెళ్తుండగా తనిఖీల్లో పట్టుబడ్డాడు. వెంటనే తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మే 30, 2023కి చార్జ్‌షీట్ ఫైల్ చేశారు. తిరుపతిలోని II అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో విచారణ జరిగింది.
అయితే మే 19, 2023కి రవి కుమార్ చెన్నై, తిరుపతిలోని 7 ప్రధాన ఆస్తులను టీటీడీకి రాసిచ్చారు. వీటి విలువ కోట్లలో ఉంటుంది. ఆ తర్వాత, సెప్టెంబర్ 9, 2023న లోక్ అదాలత్‌లో రాజీ చేసుకుని కేసు క్లోజ్ అయింది. ఈ ప్రాసెస్ టీటీడీ లా డిపార్ట్‌మెంట్ ద్వారా కాకుండా, మాజీ విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ సతీష్ కుమార్ చేత జరిగింది. తాను పోలీసు అధికారుల ఒత్తిడికి లొంగి ఈ రాజీ చేశానని సతీష్ కుమార్ వాంగ్మూలం ఇచ్చాడు. ఓ చిన్న క్లర్క్ కు కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వస్తాయని దీని వెనుక పెద్ద ముఠా ఉందని భానుప్రకాష్ రెడ్డి అంటున్నారు.
రవికుమార్ ఆస్తులు కొన్నింటిని టీటీడీకి రాసిచ్చి.. వందల కోట్ల ఆస్తులు వైసీపీ నేతలు రాయించుకున్నారన్న ఆరోపణలు చేస్తున్నారు. నారా లోకేష్ కూడా ఈ అంశంపై స్పందించారు. అధికారం అండతో జగన్ గ్యాంగ్ శ్రీవారికి చేయని అపచారం లేదు. భక్తులు మహా ప్రసాదంగా భావించే లడ్డూని కల్తీ చేశారు. అన్న ప్రసాదాన్ని భ్రష్టు పట్టించారు. తిరుమల దర్శనాలను అమ్మేసి సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం దుర్లభం చేశారు. ఏడుకొండల జోలికి వెళ్ళవద్దు, శ్రీవారికి అపచారం తలపెట్టవద్దు అని.. నాడు జగన్మోహన్ రెడ్డికి బతిమాలి చెప్పారు చంద్రబాబు గారు.. అయినా వినలేదు. ఏడుకొండలవాడు చాలా పవర్ ఫుల్ సామీ.. ఆయనకు అపచారం తలపెట్టినా, ఆయన సన్నిధిలో అవినీతికి పాల్పడినా.. ఏం జరుగుతుందో తెలిసినా జగన్, భూమన ఏకంగా పరకామణినే దోచేశారని.. నిందితులే పాపాల చిట్టా విప్పబోతున్నారని ప్రకటించారు.