తిరుపతి: రాష్ట్రంలో సీఎం జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక ద్రబాబు ఇసుక దోపిడీ అంటూ అబద్దపు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర గనులు, ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర-సాంకేతికశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. తిరుపతిలోని క్యాంప్ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు అందుతున్న సంక్షేమం, చేకూరుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక చంద్రబాబు గోబెల్స్ మాదిరిగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఇసుక దోపిడీ అంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరుతో అర్థంలేని ఆరోపణలకు దిగాడన్నారు.


ప్రభుత్వ సంక్షేమ పథకాలు, జరిగిన అభివృద్ధి ప్రజలకు గుర్తుకు రాకూడదనేది ఆయన లక్ష్యం. వైసీపీ ప్రభుత్వం ఆధునిక విద్యావిధానంను తీసుకువచ్చింది. నాడు-నేడు కింద పాఠశాలలను అభివృద్ది చేస్తోంది. బైజూస్ వంటి సంస్థలతో కంటెంట్ లను విద్యార్ధులకు అందిస్తోందన్నారు. కార్పోరేట్ తరహాలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని తీసుకువచ్చింది. అవినీతి ఆరోపణలతో ప్రజలను పక్కదోవ పట్టించడంలో భాగమే ఇసుకపై తాజాగా చంద్రబాబు చేసిన ఆరోపణలు అన్నారు. 


ఇసుక కోసం నిర్వహించిన టెండర్లలో ఎందుకు పాల్గొనలేదు? ఒకవేళ ఆరోజు గుర్తు లేకపోతే తరువాత అయినా పాల్గొనవచ్చు. అందుకు చాలా సమయం ఇచ్చాం. టెండర్లు దక్కించుకున్న సంస్థ టన్నుకు రూ. 375 ప్రభుత్వానికి చెల్లించాలి. మరో వంద రూపాయలు వారి అడ్మిసిస్ట్రేటీవ్ ఖర్చులుగా తీసుకుంటారు. అంటే మొత్తం రూ. 475 టన్ను ఇసుకను ప్రభుత్వానికి విక్రయించాలి. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లను ప్రతివారం పత్రికల్లో ప్రకటిస్తున్నాం. ఎక్కువ రేటు అమ్ముతూ ఉంటే మన దృష్టికి తీసుకురావాలని ప్రచారం చేశామన్నారు మంత్రి పెద్దిరెడ్డి. కానీ చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.  అక్రమాలకు పాల్పడితే రెండు లక్షల రూపాయలు జరిమానా, రెండేళ్ళ వరకు జైలుశిక్ష విధించేలా చట్టాలు చేశామన్నారు. ఉచిత ఇసుక విధానం పేరుతో టీడీపీ హయాంలో చంద్రబాబు ఎవరికి ఉచితంగా ఇచ్చారు? ప్రజల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో చేసిన ఇసుక తవ్వకాల వల్ల ఏకంగా ఎన్జీటి వంద కోట్ల రూపాయలు జరిమానా విధించిందన్నారు.


ఇసుకపై జీఎస్టీ వసూలు చేయలేదని చంద్రబాబు మాట్లాడుతున్నారు. జిఎస్టీ వసూళ్ళు కేంద్రప్రభుత్వ విభాగాలు చూసుకుంటాయి. జీఎస్టీ చెల్లించకపోతే సదరు సంస్థలపై వారు చర్యలు తీసుకుంటారు. దీనితో రాష్ట్రానికి ఏం సంబంధం అని ప్రశ్నించారు. ఉచిత ఇసుక పేరుతో నువ్వు, లోకేష్ జేబులు నింపుకున్నారు, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ కు ఇసుకను తరలించలేదా? అని ప్రశ్నించారు. మా ప్రభుత్వ హయాంలో ఏడాదికి రూ. 765 కోట్లు ఇసుక వల్ల ఆదాయం వస్తోంది. నాలుగేళ్లలో 3 వేల కోట్లు వచ్చిందన్నారు. అయితే నలబై వేల కోట్ల ఇసుక అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబు ఏ లెక్కల ప్రకారం చెబుతున్నారు. 


2018-19లో తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయేప్పుడు రూ.1950 కోట్లు మైనింగ్ రెవెన్యూ. ఆరోజు మైనర్ మినరల్స్ లో రూ.1263 కోట్లు ఆదాయం కాగా, మేజర్ మినరల్స్ లో రూ.687 కోట్లు, ఈ రోజు 2022-23 లో రూ.4756 కోట్లు మైనింగ్ రెవెన్యూ వచ్చింది. దానిలో మైనర్ మినరల్స్ లో రూ.3882 కోట్లు కాగా, మేజర్ మినరల్స్ లో రూ. 874 కోట్లు రెవెన్యూ వచ్చింది. మేం పారదర్శకంగా చేయకపోతే ఈ రూ.1950 కోట్లు దగ్గరే ఉండేవారం కాదా? మేం దోపిడీ చేసేట్లయితే ఆదాయం రూ.4756 కోట్లుకు ఎలా పెరిగిందన్నారు. 


ఈ ఏడాది 9వేల కోట్లకు మైనింగ్ ఆదాయం పెరుగుతందని అంచానా. ఎపిఎండిసికి 2018-19లో రూ. 833 కోట్లు ఆదాయం వస్తే, 2022-23 లో రూ.1800 కోట్లు, 2023-24లో నాలుగు వేల కోట్ల వరకు రెవెన్యూ వస్తుందని అంచనా. దాదాపు రెండు, మూడు రెట్లు రెవెన్యూ పెరిగితే, మైనింగ్ లో దోపిడీ జరుగుతోందని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 48 గంటల్లో సమాధానం చెప్పాలని చంద్రబాబు అల్టిమేటం ఇచ్చారు. ఆయన నేతృత్వంలో ప్రభుత్వం పనిచేయడం లేదని, అయినా కూడా మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ, డిఎంజి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చంద్రబాబు ఆరోపణలకు సమాధానం ఇస్తారని చెప్పారు. 


చంద్రబాబు, లోకేష్, పవన్ ఈ ముగ్గురు కలిసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. వీరికి రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ది చెబుతారు. ఉన్న మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీతో జగన్ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో మూడు కోట్ల తొంబై లక్షల ఓట్లలో 2018-19 ఎన్నికల ముందు దాదాపు 60 లక్షల దొంగ ఓట్లు చంద్రబాబు ప్రభుత్వ ఆధ్వర్యంలో చేర్పించారు. వీటన్నింటికి ఆధారాలు ఉన్నాయి. మాకు దొంగోట్లతో గెలవాల్సిన అవసరం లేదన్నారు. ఈ నెల 28వ తేదీన మా ఎంపీలు లు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని, కేంద్ర హోంమంత్రిని కలుస్తున్నారు. దొంగ ఓట్లను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని తెలిపారు.