AP Assembly Polls 2024 : తాడిపత్రి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలిచే నియోజకవర్గాల్లో అనంతపురం జిల్లా తాడిపత్రి ఒకటి. మే 13న ఎన్నికలు ముగిసినా.. పోలింగ్ రచ్చ మాత్రం ఇంకా ముగియలేదు. తాడిపత్రి పట్టణంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ నేత సూర్యముని ఇంటిపై వైసీపీ వర్గీయుల రాళ్లతో దాడికి పాల్పడటంతో తాడిపత్రి పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు పార్టీ వర్గాల రాళ్ల దాడి, ఘర్షణలో సీఐ మురళీకృష్ణ తలకు గాయమైనట్లు తెలుస్తోంది. తమ పార్టీ నేతపై దాడిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి తన వర్గీయులతో ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటికి బయలుదేరడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తాడిపత్రి పట్టణంలో మంగళవారం నాడు హైటెన్షణ్ వాతావరణం కనిపిస్తోంది.




తాడిపత్రిలో రెండు పార్టీల కార్యకర్తలు, మద్దతుదారులు వేలాదిగా రోడ్లపైకి రావడంతో పోలీసులు భాష్ప వాయుపు ప్రయోగించినట్టు సమాచారం. పరిస్థితి అదుపు తప్పుతుందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తాడిపత్రి పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల మధ్య  ఘర్షణ జరిగింది.




మొదట ఎమ్మెల్యే కేతిరెడ్డి వర్గీయులు, వైసీపీ కార్యకర్తలు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి  అనుచరులుపై రాళ్ల దాడికి దిగారు. టీడీపీ శ్రేణులు సైతం ఎదురుదాడులకు దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ రాళ్ల దాడిలో పోలీసుల వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. కేంద్ర బలగాలు సైతం రాళ్లదాడి, ఇరు వర్గాల ఘర్షణను అదుపు చేయలేకపోవడంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తీవ్ర ఉద్రికత పరిస్థితులు మధ్య తాడిపత్రిలో 144 సెక్షన్ కొనసాగుతోంది.