చిత్తూరు జిల్లా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం చిత్తూరు డెయిరీని తెరిపిస్తున్నామన్నారు సీఎం జగన్. చిత్తూరు జిల్లా వేలూరులో ఏర్పాటు చేయబోయే ప్లాంట్‌కు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబుపై విమర్శలు చేశారు.  చిత్తూరులో జరిగినన భూమి పూజ కార్యక్రమంలో గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ షమల్ బాయి బి పటేల్, కైరా జిల్లా కో ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్ యూనియన్ లిమిటెడ్ విపుల్ పటేల్, రాష్ట్ర మంత్రులు, వ్యవసాయ, సహకార శాఖ స్పెషల్ సీఎస్ గోపాల కృష్ణ ద్వివేది తదితరులు పాల్గొన్నారు.  


చంద్రబాబు కావాలనే చిత్తూరు డెయిరీని నష్టాల్లోకి నెట్టి మూసివేయించారని జగన్ ఆరోపించారు. తన సొంత డెయిరీ బాగు కోసం చంద్రబాబు ఇలా చేశారని ధ్వజమెత్తారు. తాను పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం 20 క్రితం మూత బడిన చిత్తూరు డెయిరీని తిరిగి ప్రారంభిస్తున్నామని అన్నారు. 






ఈ డెయిరీలో 325 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు అమూల్ అంగీకరించిందని ప్రకటించారు జగన్. దీనికి శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ డెయిరీ కారణంగా ప్రత్యక్షంగా ఐదు వేల మందికి పరోక్షంగా రెండు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు సీఎం జగన్. 






ఆంధ్రప్రదేశ్‌లోకి అమూల్‌ సంస్థ రావడంతో చాలా మార్పులు వచ్చాయని వివరించారు జగన్. అమూల్‌లో పాలు వేస్తున్న మహిళలకు ఆరు నెలలకోసారి బోనస్‌తోపాటు లాభాలు కూడా వస్తున్నాయన్నారు. గేదె, ఆవు పాలు రేట్లు కూడా పెరిగాయన్నారు. ఈ సంస్థ రాకతో చాలా డెయిరీలకు జ్వరం వచ్చిందని వాళ్లు కూడా పాలు రేట్లు పెంచక తప్పలేదన్నారు. దీని ఫలితంగా పాడి రైదులకు నాలుగు వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందన్నారు జగన్.  


ప్రస్తుతం శంకుస్థాపన చేసుకున్న ప్లాంట్‌లో పది నెలల్లో ప్రాసెసింగ్ మొదలవుతుందని జగన్ వెల్లడించారు. పది నెలల్లో పాల ప్రాసెసింగ్ మొదలవుతుంది. తొలి దశలో 150 కోట్లతో పనులు ప్రాంరభంకానున్నాయని వివరించారు. 






చిత్తూరు డెయిరీని నష్టాల్లోకి నెట్టిన చంద్రబాబు చిత్తూరు జిల్లాకు చేసిన మేలు ఒక్కటీ లేదన్నారు జగన్. చంద్రబాబు చిత్తశుద్ధి లేని వ్యక్తి అని విమర్శించారు. 2004లో చంద్రబాబు మరోసారి గెలిచి ఉంటే ఆర్టీసీ కూడా  ఉండేది కాదన్నారు. ముడుపుల కోసం ప్రభుత్వ సంస్థలను, పరిశ్రమలను నష్టాల్లోకి నెట్టేసి అమ్మేసి చరిత్ర చంద్రబాబుది అన్నారు. పరిశ్రమలకు నష్టాలు చూపించి తన వాళ్లకు కట్టబెట్టారని ఆరోపించారు. 


చంద్రబాబు చిత్తూరు జిల్లాతోపాటు తనను గెలిపిస్తున్న కుప్పం ప్రజలని కూడా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు జగన్. 70 ఏళ్ల వయసులో ఇప్పుడు ఇల్లు కట్టుకుంటానంటూ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అందుకే కుప్ప ప్రజలకు చంద్రబాబుకు బై బై చెప్పేస్తున్నారని అన్నారు.