Anantapur Gas Cylinder: గ్యాస్ సిలిండర్ లో మంచినీళ్లు. ఇది వినడానికి వింతగా ఉన్నా నిజం. ఓ గృహిణి ఇంట్లో వంట చేస్తుండగా ఆమెకు ఎదురైన వింత అనుభవం ఇది. గ్యాస్ పొయ్యిలో మంట రాకపోవడంతో సిలిండర్ చెక్ చేయగా ఆమె విస్మయం చెందాల్సి వచ్చింది. ఆ గ్యాస్ సిలిండర్ లో ఎల్పీజీకి బదులుగా నీళ్లు ఉండడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది.


అనంతపురం నగరంలోని కోవూరు నగర్ కి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి ఇంట్లో ఇండేన్ గ్యాస్ వాడుతున్నారు. ఎప్పటి లాగే వారం రోజుల క్రితం కొత్త గ్యాస్ సిలిండర్ ను మార్చారు. వారం రోజులకే స్టవ్ వెలగలేదు. గ్యాస్ సరఫరా కాలేదు అనుమానం వచ్చి సిలిండర్ చెక్ చేయగా.. అది బరువుగానే ఉంది. గట్టిగా ఊపగా అందులో నీళ్ళ శబ్ధం వస్తోంది. ఆనంద్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు సమాచారం ఇవ్వగా గ్యాస్ బాయ్ వచ్చాడు. సిలిండర్ లో నీళ్ళు ఉన్నాయని నిర్ధారించారు. ఇది కంపెనీ నుంచే ఇలా వచ్చిందని చెప్పాడు.. ఫిర్యాదు చేసి కొత్త సిలిండర్ మారుస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. 


కానీ, ఏజెన్సీ వాళ్ళు మాత్రం తమకు సంబంధం లేదని చెబుతున్నారు. సిలిండర్ లో నీళ్ళు ఎలా వచ్చాయి.. ఇదో కొత్త రకం మోసమా? అని అనుమానాలు కలుగుతున్నాయి. నిజంగా కంపెనీ నుంచి ఇలా వస్తాయా..? అని స్థానికులు అనుమానం చెందుతున్నారు. ఇప్పటి వరకు ఇలా ఎప్పుడూ జరిగిన దాఖలాలు అయితే కనిపించలేదు.


గత వారంలో గ్యాస్ స్టవ్ వెలగలేదు అని.. సిలిండర్ ను తాను చెక్ చేశానని, దాంట్లో నుంచి నీళ్ల శబ్దం వచ్చిందని గృహిణి మమత వెల్లడించారు. గ్యాస్ ఏజెన్సీ వాళ్లకు చెప్పిన వారం రోజుల పాటు పాటించుకోలేదని అన్నారు. 1906 కి కాల్ చేసి ఫిర్యాదు చేయడంతో గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు వచ్చి మరొక సిలిండర్ ను మార్చారని చెప్పారు. 


ఎప్పుడైనా ఓసారి ఇలాంటి తప్పిదాలు జరుగుతూ ఉంటాయని గ్యాస్ డెలివరీ బాయ్ చెప్పినట్లుగా మమత వెల్లడించారు. గ్యాస్ సిలిండర్ లలో నీటిని నింపడం ఎలా సాధ్యం అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.