Anantapur: కన్న కూతురు తనను మోసం చేసిందని జీవితంపై విరక్తితో ఓ తల్లి పడుతున్న వేదన ఇది. ఇక తాను బతకలేనంటూ తన భర్తతో పాటు చనిపోయేందుకు అనుమతి ఇవ్వాలని జిల్లా ఎస్పీని ఓ పెద్దావిడ వేడుకుంది. ఈ దయనీయ ఘటన అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో జరిగే స్పందన కార్యక్రమంలో బాధితురాలు తమ ఆత్మహత్యకు అనుమతివ్వాలని కోరింది. ఈ ఫిర్యాదు అందగానే ఎస్పీ ఫకీరప్ప బాధితురాలు అయిన షేక్ నన్నీబీ అనే వృద్ధురాలి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె తెలిపిన వివరాలు ఇవీ..
అనంతపురం జిల్లా మున్నానగర్‌కు చెందిన షేక్ నన్నిబీ, షేక్ రజాక్ సాహెబ్ భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒక కూతురు, ముగ్గురు కొడుకులు. షేక్ నన్నిబీ అనే పెద్దావిడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కబేళాలో పని చేసింది. వయసు పైబడడంతో ఇటీవలే ఉద్యోగం మానేసింది. పదవీ విరమణ అనంతరం రిటైర్‌మెంట్ బెనిఫిట్ రూపంలో ఆమెకు సుమారు రూ.21 లక్షలు వచ్చాయి. ఈ డబ్బు అంతా ఆమె అకౌంట్ లోనే జమ అయ్యాయి.
వృద్ధాప్య దశలో తనకు, భర్తకు ఆ డబ్బు అండగా ఉంటుందని ఆమె భావించింది. ఆనారోగ్యాలు, ఇల్లు గడిచేందుకు అది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో తన వద్దే ఉంచుకుంది. ఇంత సొమ్మును తన తల్లి దగ్గర చూసిన కన్న కూతురికి ఆశ పుట్టింది. తమ్ముడి ఇంటి వద్ద ఉన్న తల్లిని పిలిచి మరీ తన ఇంటికి తీసుకెళ్లింది. తర్వాత ఏ తల్లి పట్ల అమానుషంగా ప్రవర్తించింది.
షుగర్ మాత్రలకు బదులు తల్లికి రోజూ నిద్ర మాత్రలు ఇచ్చేది. అలా మగతగా ఉన్నప్పుడు బ్యాంకుకు తీసుకెళ్లి మొత్తం రిటైర్‌మెంట్ సొమ్మును తన అకౌంట్ లోకి ట్రాన్స్‌ఫర్ చేయించుకుంది. నీ దగ్గర ఉంటే ఎవరైనా మోసం చేస్తారని, తర వద్ద భద్రంగా ఉంచుతానని చెప్పి తల్లిని నమ్మించింది.
కొన్నాళ్లు గడిచాక, షేక్ నన్నిబీకి డబ్బులు అవసరం అయి కూతుర్ని అడిగితే మొత్తం నీకే ఖర్చు పెట్టా కదా.. ఇంక నా దగ్గర ఏముంటాయి అంటూ మొహం చాటేసింది. తన భర్త దివ్యాంగుడని, కుమారుడికి ఎప్పుడూ అనారోగ్యం ఉంటుందని, బాధితురాలు వాపోయింది. తనకు ఓ కన్ను కనిపించకపోయినా మెల్లగా స్పందన కార్యక్రమానికి వచ్చింది.
ఎస్పీ కార్యాలయంలో ఇప్పటికి నాలుగుసార్లు అర్జీ ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని వాపోయింది. తాను ఇలా ఆర్థిక ఇబ్బందులతో బతకలేమని రోధించింది, తన కూతురే మోసం చేస్తే ఇక ఎలా బతకాలని, భర్తతో కలిసి మరణించడానికి తనకు అనుమతి ఇవ్వాలని అధికారులను వేడుకుంది. దీంతో స్పందించిన ఎస్పీ బాధితురాలికి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.