పర్యాటక ప్రదేశాలు మరింత అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తామ‌న్నారు ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక మంత్రి ఆర్ కె రోజా. గ్రామగ్రామానా క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసేందుకు కూడా చొరవ తీసుకుంటున్నామని వివ‌రించారు. ఏపీ సచివాలయంలోని మంత్రి చాంబర్‌లో టూరిజం, సాంస్కృతిక, క్రీడా శాఖ అధికారులతో మంత్రి  ఆర్. కె. రోజా సమీక్షా సమావేశం నిర్వహించారు. టూరిజం సాంస్కృతిక, క్రీడా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హెచ్ఓడిలతో శాఖల వారీగా సమీక్ష చేశారు.


ప్రస్తుతం పురోగతిలో ఉన్న పనుల ప్రగతిపై మంత్రి ఆరా తీశారు. పర్యాటక శాఖలో టూరిజం ప్రాజెక్టులలో భూసేకరణ పనులు, ఓ అండ్ ఎం టెండర్స్, పిపిపి ప్రాజెక్టుల పురోగతి, ప్రసాద్ స్కీమ్ ద్వారా చేపట్టిన పనులను మంత్రికి అధికారులు వివరించారు. రాష్ట్రంలో పర్యాటకశాఖ పరిధిలో ఉన్న హరితహోటల్స్ లీజు, వాటి నిర్వహణ, పని తీరుపై తెలియజేశారు. రూయ హస్పిటల్ వద్ద నిర్మాణంలో బిల్డింగ్ పనులను మంత్రి అడిగి తెలుసుకున్నారు.


రాష్ట్రంలో చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని, వాటిని పర్యాటకపరంగా మరింతగా అభివృద్ధి చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశ్యమని అధికారులకు మంత్రి వివరించారు. పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్దానంలో ఉండాలని, ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి సంబంధించి ప్ర‌చారం చేయాలని సూచనలు చేశారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా పర్యాకట ప్రదేశాలను తీర్చిదిద్దాలని దిశానిర్దేశం చేశారు.


రాష్ట్రంలో ఉన్న హిల్ ప్లేస్, బస్సు రవాణా సౌకర్యం లేని పర్యాటక ప్రాంతాలకు అప్రోచ్ రోడ్లు వేయాలని, రోడ్లని ఆధునీకరించడానికి రోడ్లు, భవనాల శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు రోజా. మైపాడు బీచ్, కాళహస్తీ పర్యాటక ప్రదేశాలపై ఆధికారులతో చర్చించారు. సాంస్కృతిక శాఖకు సంబంధించి అరకు ట్రైబల్ మ్యూజియం అభివృద్ది పనులపై చర్చించారు. 


న‌దీ ప‌రివాహ‌క ప్రాంతాలు, స‌ముద్ర తీర ప్రాంతాల్లోని వ‌నరుల‌ను స‌ద్వినియోగం చేసుకోవటం ద్వార ప‌ర్యాట శాఖ‌ను మ‌రింత‌గా అభివృది చేసుకునేందుకు వీలుంటుంద‌ని రోజా అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ విష‌యంలో ప్ర‌త్యేక దృష్టి సారించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆమె అన్నారు. ఎపీలో ప‌ర్య‌ాటకానికి ఉన్న అన్ని అవ‌కాశాలు, వ‌న‌రులను ప‌రిశీలించి వాటిని అవ‌స‌రం అయిన అభివృద్ది ప‌నుల‌కు రూట్ మ్యాప్ ను త‌యారు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని రోజా అభిప్రాయ‌ప‌డ్డారు. 


రాష్ట్రంలోని పాఠశాల విద్యార్ధులకు జగనన్న స్పోర్ట్ కిట్స్ అందించే అంశాలపై క్రీడాశాఖ అధికారులతో చర్చించారు. పీవైకేకేఏ ఫండ్స్ ద్వారా చేస్తున్న కార్యక్రమాలు, ప్రైవేట్ స్పోర్ట్ అసోసియేషన్స్ గుర్తింపు, రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటు, స్పోర్ట్స్ స్టేడియాల నిర్మాణాలపై చర్చించారు. చర్చించిన అంశాలపై చర్యలు చేపట్టాలని, వాటిపై నివేదికను అందించాలని అధికారులను ఆదేశించారు.