Tiruchanoor Padmavathi Ammavari Bramhosthavam: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక మాస బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. తిరుమల శ్రీవారి దేవేరిగా భక్తుల పూజలు అందుకుంటున్న అలిమేలు మంగమ్మ కు ప్రతిరోజూ ఉదయం సాయంత్రం రెండు పూటలా వివిధ వాహన సేవలు జరుగుతాయి.
శ్రీవారి పట్టపురాణి అభయ వరముద్ర
తిరుమల శ్రీవారి ఆనంద నిలయం లో శ్రీనివాస వక్షస్థలంలో ద్విభుజా వ్యూహలక్ష్మి అన్నట్లుగా రెండు భుజాలతో రెండు చేతుల్లో పద్మాలను ధరించి పద్మములో కూర్చున్న భంగిమలో దర్శనం ఇస్తుంది. ఆమె తిరుపతి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయ దిశలో తిరుచానూరు అనే గ్రామంలో పద్మంలో కూర్చున్న చతుర్భుజాలతో అర్చనామూర్తిగా దర్శనం ఇస్తుంది. అమ్మవారి పైన రెండు చేతుల్లో పద్మాలను.. కింద కుడి, ఎడమ హస్తాల్లో అభయ వరముద్రలతో భక్తులను కటాక్షిస్తుంది శ్రీవారి పట్టపురాణి.
బ్రహ్మోత్సవాలకు అధికారులు ఏర్పాట్లు
తిరుచానూరు బ్రహ్మోత్సవాలు ఈనెల 28 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు. ఆలయ పరిసరాలలో చలువపందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు, అమ్మవారి ఆలయం, మాడ వీధుల్లో శోభాయమానంగా విద్యుత్ అలంకరణలు చేపట్టారు. బ్రహ్మోత్సవాలను భక్తులు వీక్షించేందుకు వీలుగా తిరుచానూరు పరిసర ప్రాంతాలతో పాటు, పద్మ పుష్కరిణికి నాలుగు వైపులా ఈసారి మొత్తం 20 ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. పుష్కరిణిలో భక్తులు ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు వీలుగా గేట్లు, భక్తులకు అవసరమైన ప్రాంతాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు, సైన్ బోర్డులు, రేడియో అండ్ బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందించే ఏర్పాట్లు చేశారు.
రోజుకు 10 వేల మందికి అన్న ప్రసాదాలు
పంచమి తీర్థం సందర్భంగా డిసెంబరు 5వ తేదీ సాయంత్రం నుండి భక్తులు వేచి ఉండేందుకు తిరుచానూరు పరిసర ప్రాంతాలైన జడ్పీ హైస్కూల్, పూడి రోడ్డు, నవజీవన్, తిరుచానూరు గేటు వద్ద 4 హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఇందులో మొత్తం 120 కౌంటర్ల ద్వారా దాదాపు 50 వేలకు పైగా భక్తులకు తాగునీరు, అన్న ప్రసాదాలు అందించనున్నారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు రోజుకు 10 వేల మందికి సాంప్రదాయ బద్ధంగా అన్నం, పప్పు, సాంబారు, రసం, స్వీట్ తో పాటు ఈ సారి అదనంగా కర్రీని అన్నప్రసాద వితరణ చేయనున్నారు.
అమ్మవారి వాహన సేవలను ఎస్వీబీసీలో హెచ్‌డి క్యాలిటితో ప్రత్యక్ష ప్రసారాలతో పాటు, ఎస్వీబీసీ ఆన్ లైన్ రేడియో, యూట్యూబ్ ద్వారా కూడా ప్రసారాలు అందిస్తారు. అమ్మవారి వాహన సేవలో ఏడు రాష్ట్రాల నుండి కళాబృందాలు, అలిపిరి నుంచి తిరుచానూరు వరకు నిర్వహించే శ్రీపద్మావతి అమ్మవారి సారె శోభయాత్రలో 1000 మంది కళాకారులు పాల్గొటారు. బ్రహోత్సవాల్లో రోజుకు 300 మంది, పంచమితీర్థం రోజున 600 మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియమించారు. బ్రహ్మోత్సవాలలో టిటిడి భద్రతా సిబ్బంది, పోలీసులతో కలిపి 460 మంది, పంచమి తీర్థం రోజున 1500 మంది పోలీసులు, 600 మంది విజిలెన్స్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
బ్రహోత్సవాల రోజుల్లో 500 మంది, పంచమితీర్థం రోజు 1000 మంది శ్రీవారి సేవకులు, 200 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ భక్తులకు సేవలందిస్తారు. అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన డిసెంబరు 6వ తేదీ పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం 10 గంటలకు అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం మొదలవుతుందని, మధ్యాహ్నం 12.15 గంటల మధ్య పద్మ పుష్కరిణిలో పంచమితీర్థం చక్రస్నానం నిర్వహించనున్నారు.
ఆకర్షణీయంగా ఉండేలా కళాబృందాలతో ప్రదర్శనలు
హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కళాబృందాలతో ఆకర్షణీయంగా ఉండేలా ప్రదర్శనలు చేపట్టారు. భక్తులను ఆకట్టుకునేలా తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణి, శిల్పారామం, తిరుచానూరులోని ఆస్థాన మండపంలో ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. శుక్రవారపు తోటలో పుష్ప ప్రదర్శనశాలతో పాటు ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు, వివిధ దేవతామూర్తులు, శ్యాండ్ ఆర్ట్ రూపొందించారు.
వైభవంగా లక్ష కుంకుమార్చన
వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం ఆలయంలో లక్ష కుంకుమార్చన వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవర్లను శ్రీకృష్ణస్వామి ముఖ మండపానికి వేంచేపు చేసి అక్కడ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లక్ష కుంకుమార్చన వైభవంగా చేపట్టారు.
సాయంత్రం 6.00 నుంచి రాత్రి 8.30 గంటల వరకు పుణ్యహవచనం, రక్షా బంధనం, ఆలయ నాలుగు మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహించిన తరువాత శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం జరిగింది.
వాహన సేవల వివరాలు:
తేది సమయం - వాహన సేవలు
28.11.2024 ఉ. 9.00 - ఉ.9.30 ధ్వజారోహణము
రాత్రి 7.00 - 9.00 చిన్నశేష వాహనము
29.11.2024 ఉ. 8 - 10 పెద్దశేష వాహనము
రా.7 - 9 హంస వాహనము
30.11.2024 ఉ. 8 - 10 ముత్యపు పందిరి వాహనము
రా. 7- 9 సింహ వాహనము
01.12.24 ఉ. 8 - 10 కల్పవృక్ష వాహనము
రా. 7 - 9 హనుమంత వాహనము
02.12.24 ఉ. 8 - 10 పల్లకి వాహనము
రా. 7 - 9 గజ వాహనము
03.12.24 ఉ. 8 - 10 సర్వభూపాల వాహనము
సా.4.20 - 5.20 స్వర్ణ రథోత్సవము
రా. 7 - 9 గరుడ వాహనము
04.12.24 ఉ. 8 - 10 సూర్య ప్రభ వాహనము
రా. 7 - 9 చంద్రప్రభ వాహనము
05.12.24. ఉ. 8 - 10 రథోత్సవము
రా. 7 - 9 అశ్వవాహనము
06.12.24 ఉ. 7 - 8 పల్లకీ ఉత్సవము
మ.12.15 - 12.20 పంచమి తీర్థము, రాత్రి: ధ్వజావరోహణం
07.12.2024 : సాయంత్రం - పుష్పయాగం
బ్రహ్మోత్సవాల సందర్భంగా నవంబర్ 26 నుంచి డిసెంబర్ 8 వరకు అన్ని ఆర్జిత సేవలు, కుంకుమార్చన, వేదాశీర్వచనం, విఐపి బ్రేక్ దర్శనాలను టిటిడి రద్దు చేసింది.