MP Mopidevi On Lokesh : తిరుమల శ్రీవారిని వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఎంపీ మోపిదేవి వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో సంక్షేమ రథసారధిగా సీఎం జగన్ గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. ప్రతి పౌరుడు సుఖసంతోషాలతో ఉండాలని సీఎం కోరుకుంటున్నారని తెలిపారు. ప్రతిపక్షాలు ఉనికిని కాపాడుకోడానికి పాకులాడుతున్నాయన్నారు. ఉనికిని చాటుకునేందుకే చంద్రబాబు తనయుడు లోకేశ్ పాదయాత్ర చేపట్టారని అన్నారు. లోకేశ్ ది పాదయాత్ర కాదు విహార యాత్ర అంటూ ఎద్దేవా చేశారు.  సిద్ధాంతపరమైన యాత్ర లోకేశ్ చేయడం లేదన్నారు. గతంలో చంద్రబాబు పాదయాత్ర చేసినా ఏ ఒక్క సమస్య పరిస్కారం చేయలేకపోయాడని ఆరోపించారు. 


మళ్లీ వైసీపీదే అధికారం 


పాదయాత్ర చేసి అన్ని వర్గాల ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు సీఎం జగన్ అమలు చేశారని ఎంపీ మోపిదేవి వెంకట రమణ స్పష్టం చేశారు. లక్షలాది మంది ప్రజలకు ఉద్యోగ అవకాశాలు సీఎం జగన్ కల్పించామన్నారు. హామీలు తుంగలో తొక్కిన ఘనత టీడీపీదని విమర్శించారు. టీడీపీ ఎన్ని పొర్లు దండాలు పెట్టినా, ఏం చేసిన 2024లో అధికారం చేపట్టబోయేది వైసీపీనే అని మోపిదేవి ధీమా వ్యక్తం చేశారు. 


నోరు అదుపులో పెట్టుకో 


"సీఎం జగన్ ఎంతో పారదర్శకంగా పాలిస్తున్నారు. టీడీపీ ఉనికిని చాటుకునేందుకు, పాదయాత్ర చేస్తే అధికారంలోకి వస్తామనే భ్రమతో లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారు. లోకేశ్ పాదయాత్ర ముసుగులో విహారయాత్ర చేస్తున్నారు. అది హైటెక్ యాత్ర. 2014 ముందు చంద్రబాబు పాదయాత్ర చేశారు, కానీ ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదు. జగన్ అలాకాదు పాదయాత్రలో తాను చూసిన సమస్యలను వాటిని పరిష్కరించారు. నూటికి 98 శాతం హామీలు జగన్ అమలుచేశారు. రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు , లోకేశ్ మాత్రమే సంతోషంగా లేరు. లోకేశ్ ఎన్ని పొర్లుదండాలు పెట్టినా మళ్లీ అధికారంలోకిరారు. అధికారంలోకి రామనే ప్రస్టేషన్ లో లోకేశ్ సీఎం జగన్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. లోకేశ్ నోరు అదుపులో పెట్టుకో." - ఎంపీ మోపిదేవి వెంకట రమణ